కార్మికుల బాగోగులపై మ్యానిఫెస్టోల్లో చేర్చాల్సిందే

On the welfare of workers It should be included in the manifestos– రూ.26వేల కనీసవేతనం అమలుపై స్పష్టతనివ్వాలి
– సంఘటిత, అసంఘటిత సమస్యల పరిష్కారంపై హామీనివ్వాలి
– 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాల సవరణపై స్పందించాలి
– సీఐటీయూ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఉద్యోగ, కార్మిక సంఘాల నేతల డిమాండ్‌
– వర్కర్స్‌ మ్యానిఫెస్టో విడుదల.. 18న ఆయా పార్టీలకు అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర జనాభాలో 30 శాతానికిపైగా ఉన్న కార్మికులకు రూ.26 కనీస వేతనం అమలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల మిగతా సమస్యల పరిష్కారంపై ఆయా పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. తమ మ్యానిఫెస్టోల్లో కార్మికుల బాగోగులు, మెరుగైన జీవనం కోసం తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని అన్ని పార్టీలూ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఈనెల 18 నుంచి ఆయా పార్టీల మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీలకు తాము రూపొందించిన వర్కర్స్‌ మ్యానిఫెస్టో అందజేస్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి వర్కర్స్‌ మ్యానిఫెస్టో రూపొందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ జీఓలను సవరించడం, విడుదలైన 5 జీఓలకు గెజిట్‌ జారీ చేయడం, కనీస వేతనం రూ.26 వేలు అమలు ఎప్పటిలోగా చేస్తామనే దాన్ని పార్టీలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి వివిధ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌పైనా స్పష్టతివ్వాలన్నారు. సమాన పనికి – సమాన వేతనం అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువులోపు పీఆర్సీని 30 శాతంగా ఫైనలైజ్‌ చేయడం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా ఐఆర్‌ ఇవ్వడం అంశాలను పొందుపర్చాలని కోరారు. స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత చట్టాలను అమలు చేసేలా నిర్ణయం ప్రకటించాలన్నారు. స్థానిక సంస్థల్లో పనిచేసే గ్రామ పంచాయితీ, మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడం, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర శాసనం చేయడం, వారికి పెన్షన్‌ నెలకు రూ.7 వేలు చెల్లించడం, మందుల ధరలు తగ్గించడం, మందులు, మందుల తయారీ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయడం, నూతన పెన్షన్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడం, బీడీ పరిశ్రమకు నష్టదాయకమైన కోప్టా చట్టాన్ని రద్దు చేయడం వంటి అంశాలపై అన్ని పార్టీలూ తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
మూసేసిన పరిశ్రమలను తెరిపించడం, సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కాంట్రాక్ట్‌ కార్మికులకు ఓటు హక్కు కల్పించడం, సింగరేణి లాభాల్లో పర్మినెంట్‌ ఉద్యోగులకు వాటాగా బోనస్‌ చెల్లిస్తున్నట్లుగానే కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా లాభాల వాటాను చెల్లించడంతో పాటు మరికొన్ని అంశాలను వర్కర్స్‌ మ్యానిఫెస్టోలో చేర్చామనీ, వీటిన్నింటికీ అన్ని పార్టీలూ తమ మ్యానిఫెస్టోల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ. చంద్రశేఖర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాల్‌రాజ్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు రెబ్బా రామారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌కే. బోస్‌, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయకుమార్‌ యాదవ్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె. వెంకటేష్‌, బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు, బీడీఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టి. సత్తయ్య, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర నాయకులు జీఆర్‌.రెడ్డి, హెచ్‌ఆర్‌జీఐఇఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. సుబ్బారావు, టీఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌. భానుకిరణ్‌, పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. శ్రీకాంత్‌, సెక్యూరిటీ గార్డ్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు కవిత, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు అనురాధ, శివబాబు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్‌, రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఎం. చంద్రమోహన్‌, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రావణ్‌కుమార్‌, మీనా తదితరులు పాల్గొన్నారు.