– బిల్లు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు
– మహిళలపై దాడులకు నిరసనగా 5న ఢిల్లీలో ర్యాలీ : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, మణిపూర్ ఘటనపై మభ్యపెట్టేందుకే బిల్లు తెచ్చిందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఊరించే రీతిలో ఈ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన సాకుతో 2036 ఎన్నికల వరకు ఈ బిల్లు అమలు వాయిదా వేశారని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వచ్చేనెల 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే నిరసన ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఐద్వా అధ్యక్షులు బండి పద్మ అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో గురువారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
మణిపూర్ మారణకాండను మరిపింప చేయడం కోసమే, మహిళల దృష్టిని మరల్చేందుకే ఉన్నపళంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. మెజార్టీ ఉందని అనేక బిల్లులను ఇష్టానుసారంగా ఆమోదించుకున్న బీజేపీ మహిళా బిల్లు అమలు విషయానికి వచ్చేసరికి జాప్యం చేస్తుండటాన్ని తప్పు పట్టారు. తొమ్మిదిన్నర ఏండ్లలో లేనిది ఇప్పటికిప్పుడు ఈ బిల్లును ప్రవేశ పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తరువాతే బిల్లు అమల్లోకి వస్తుందని చెప్పడంతోనే బీజేపీకి మహిళల పట్ల ఉంది కపట ప్రేమని అర్థమైందని అన్నారు.
మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హింస, నిత్యావసరాల ధరల పెరుగుదలపై నోరు మెదపని ప్రధాని మోడీ.. మెజార్టీ ఓట్లు దండుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని మత ఘర్షణలు సృష్టిస్తున్నారన్నారు. బీజేపీ కుటీలయత్నాలను సాగనీయకుండా ఉండేందుకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 5న నిర్వహించే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే జిల్లా జాతాను విజయవంతం చేయాల్సిందిగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల భారతి కోరారు. సమావేశంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు బుగ్గవీటి సరళ, మెరుగు రమణ, అఫ్రోజ్ సమీనా, నాగసులోచన, మెహరున్నీసాబేగం, పయ్యావుల ప్రభావతి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.