ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికులు సమ్మె బాట

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకుండా చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు సమ్మెలోకి వెళ్లక తప్పలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్‌ అన్నారు. గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులను పర్మినెంట్‌ చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను ఇబ్రహీంపట్నంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులను పర్మినెంట్‌ చేసి, వేతనాలు పెంచాలన్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామాల్లో వెట్టిచాకిరి చేస్తున్న సిబ్బందికి తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు అమలు చేయాలన్నారు. 11వ పీఆర్సీలో నిర్ణయించిన మినిమం బేసిక్‌ రూ.19వేల వేతనం చెల్లించాలన్నారు. ఆలోపు జీవో నెంబర్‌ 60ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందికి కేటగిరి వారిగా వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ప్రభుత్వమే రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జీవో నెంబర్‌ 51ని సవరించి మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, గ్రాట్యూటీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఆదివారం, పండగ రోజుల్లో సెలవులు, జాతీయ సెలవు దినాలను అమలు చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. ఎనిమిది గంటల పనిదినాలను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చట్టబద్ధంగా చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ బుగ్గరాములు, మున్సిపల్‌ కన్వీనర్‌ ఎల్లేశ, గ్రామపంచాయతీ యూనియన్‌ జిల్లా కోశాధికారి దేవదాసు, నరేష్‌, మండల అధ్యక్షులు బాలప్ప, కారోబారులో సత్తిరెడ్డి, సత్యనారాయణ, యాదయ్య, మల్లేష్‌, నరసింహ, బిల్‌ కలెక్టర్‌, భాస్కర్‌, రాజశేఖర్‌, కార్మికులు మల్లేష్‌, కిషన్‌, అబ్బయ్య, పోచయ్య, రాములు, సుశీల, లక్ష్మమ్మ, సువర్ణ, పోచమ్మ, అబ్బమ్మ, బిక్షపమ్మ, పార్వతమ్మ, యాదమ్మ, రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.