ఆధార్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ చోరీ..

Aadhaar, fingerprints stolen..– సిలికాన్‌ వేలిముద్రలతో నగదు విత్‌డ్రా
– ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన సీఐడీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్‌ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. బాధితులకు తెలియకుండానే నకిలీ ఫింగర్‌ ప్రింట్స్‌తో ఆన్‌లైన్‌లో నగదును విత్‌ డ్రా చేస్తున్న ముఠాలోని మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం సీఐడీ అదనపు డీజీపీ మహేష్‌భగవత్‌ తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన రంజిత్‌ సాహా, సఫత్‌ ఆలం మరికొందరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి ఖాతాలో నుంచి విడతల వారీగా రూ.24వేలు డ్రా చేశారు. అతని ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి నగదు ట్రాన్స్‌ఫర్‌ కావడంతో బాధితుడు సీఐడీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు.. నిందితులు ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ను ఉపయోగించినట్టు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ వెబ్‌సైట్ల నుంచి సేల్‌ డీడ్‌ పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిలో ఉన్న ఫింగర్‌ ప్రింట్స్‌, ఆధార్‌ నంబర్లు, బ్యాంక్‌ వివరాలు, ఫోన్‌ నెంబర్లు నిందితులు సేకరించినట్టు గుర్తించారు. ఆ తర్వాత కంప్యూటర్లలో వాటిని స్కాన్‌ చేసి సిలికాన్‌ వేలిముద్రలు తయారు చేసుకొని.. వాటి సహాయంతో బాధితులకు తెలియకుండానే కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ మిషన్లలో బాధితుల బ్యాంక్‌లోని నగదును దోచుకుంటున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరికి సహకరించిన కస్టమర్‌ సర్వీస్‌ అధికారులపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ముఠా పలుచోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అక్రమ్‌ను సీఐడీ అధికారులు గతేడాది డిసెంబర్‌లోనే అరెస్ట్‌ చేశారు. చాకచక్యంగా కేసును ఛేదించినందుకు పోలీస్‌ అధికారులను మహేష్‌భగవత్‌ ప్రత్యేకంగా అభినందించారు.