ప్రతి ఆవేదన.. ఆందోళన వెనుక అర్థం ఉంటది

– మనకు జ్ఞానం రావద్దని కోరుకునే సమాజంలో ఉంటున్నం
– జమీందారైనా బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి బీపీ మండల్‌
– అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం యుద్దం జరిగిన ప్రాంతం మంథని
– బీపీ మండల్‌ జయంతి సభలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ-రామగిరి 

ప్రతి ఆవేదన, ఆందోళన వెనుక అర్థం ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు. బీపీ మండల్‌ జయంతి ఉత్సవాల్లో బాగంగా రామగిరి మండలం పన్నూర్ సత్య ఏసీ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాస్ ఇంజనీర్ ఫెడరేషన్ సింగరేణి బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన బీపీ మండల్ 105వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు జరిగిన స్వాతంత్య్ర ఉద్యమం, గతంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలకు ఒక్క పిలుపుతోనే ఎంతో మంది ముందుకు వచ్చేవారని అన్నారు.కానీ ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన పోయిన క్రమంలో అరచేతితో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నామే కానీ ఏది మంచో ఏది చెడో గ్రహించలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నాయకుడు పదే పదే తన ఆవేదనను ఆందోళనను వ్యక్తం చేస్తుంటే వింటున్నారే కానీ దానిని అర్థం చేసుకోకపోవడం బాధాకరమన్నారు. మనకు జ్ఞానం వస్తే ఎక్కడ ఎదురుతిరుగుతామోనని అణిచివేసే సమాజంలో ఉన్నామని, భవిష్యత్‌ తరాలు ఇంకా బానిసలుగానే బతుకాల్సిన పరిస్థతులు ఉంటాయని ఆలోచన చేయడం లేదన్నారు. జమీందారీ కుటుంబంలో జన్మించి వేల ఎకరాల భూములు ఉన్న బీపీ మండల్‌ ఆనాడు బీసీలకు రిజర్వేషన్‌లు కావాలని పోరాటం చేశారని, రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆలోచన చేసిన అంబేద్కర్‌ ఆనాడు తన పిల్లలు చనిపోయారని తెలిసినా సమాజమే తన పిల్లలుగా బావిస్తానంటూ రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయుడన్నారు.అలాగే జ్యోతిబావుపూలే, సావిత్రీబాయిపూలే దంపతులు ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు అక్షరజ్ఞానం నేర్చారే కానీ ఏనాడు తమ పోరాటాన్ని ఆపలేదన్నారు. అలాంటి మహనీయుల గురించి గత పదేళ్ల క్రితం వరకు తెలియని దుస్థితి ఉండేదన్నారు. బ్రాహ్మణీజం పూర్తిగా పాతుకు పోయిన మంథనిలో అంబేద్కర్‌ విగ్రహంఏర్పాటు చేయాలంటే ఓ యుద్దమే జరిగిందని, విగ్రహన్ని ఏర్పాటు చేసిన అప్పటి ఎంపీ సుగుణకుమారిని ఆవిష్కరణకు రాకుండా అడ్డుకున్న చరిత్ర ఇక్కడి పాలకులదని ఆయన వివరించారు. నియోజకవర్గంలో ఒకసారి రెడ్డి, ఒకసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే అధికారం ఇచ్చారని, మళ్లీ ఆ అధికారం నిలబడడం లేదని,ఇందుకు జ్ఞానం,ఆలోచన లేకపోవడమే కారణమని ఆయన అన్నారు. తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో ఇక ఇక్కడ ఉండడని ప్రచారం చేశారని, ఆనాటి నుంచి 2014వరకు పోరాటం చేస్తూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృధ్దితో పాటుఅనేక సేవా కార్యక్రమాలకు చేసినా 2018లో ఓడిపోయానన్నారు. ఆసమయంలో కూడా ఇక కనబడకుండా పోతాడని ప్రచారం చేశారని, కానీ ఇక్కడే ఉండి మళ్లీ పోటీ చేస్తన్నానని తెలిపారు. తాను మంథని విడిచి ఎక్కడికి పోనని, మంథనిని నుంచి మరో బీసీ సామాజికవర్గానికి అధికారం వచ్చాకే తాను పోరాటం ఆపుతానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవల్ల సమ్మయ్య, ప్రొఫెసర్ సింహాద్రి, దుర్గం రవీందర్, కొట్టే సతీష్, చిలుక శ్రీనివాస్, డా. మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు.