దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు ఆస్కారం

There is an opportunity to form a third alliance in the country– ఏఐ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ
నవతెలంగాణ-మెహిదీపట్నం/సుల్తాన్‌బజార్‌
దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు ఆస్కారం ఉందని, ఈ కూటమికి నాయకత్వం వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నట్టు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంఐఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తిరంగ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ ఆధ్వర్యంలో నాంపల్లిలోని యూసుఫియన్‌ దర్గా నుంచి మాసాబ్‌ ట్యాంక్‌ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మాసబ్‌ ట్యాంక్‌ ఈద్గా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్‌ పాల్గొని మాట్లాడారు. ఇండియా కూటమిని తాను కేర్‌ చేయనన్నారు. దేశంలో రాజకీయ శూనర్యత ఉన్నదని, దాన్ని ఇండియా కూటమి భర్తీ చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో బీఎస్పీ అధినేత మాయావతి, తెలంగాణ సీఎం కేసీఆర్‌, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎన్నో పార్టీలు భాగస్వాములు కాలేదని గుర్తు చేశారు. కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. ఆయనకు అసలు హైదరాబాద్‌ చరిత్ర తెలియదని విమర్శించారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో సమైక్యం చేసే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ు పరివార్‌, బీజేపీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కలపడానికి పోలీస్‌ చర్య జరిగిందని, పండిట్‌ సుందర్‌లాల్‌ ఇచ్చిన నివేదికలో ముస్లింలపై జరిగిన ఘటనలను వివరించారని తెలిపారు. రజాకార్ల ఏరివేత పేరుతో ముస్లింలపై జరిగిన దారుణాలు ఘటనలోని ఆ నివేదికలో ఉన్నాయన్నారు. తాము రజాకార్‌ల వారసులమని ఒకవైపు బీజేపీ, నిజాం వారసులమని మరోవైపు కాంగ్రెస్‌ విమర్శిస్తున్నదని అసహనం వ్యక్తం చేశారు. అది ఎంత మాత్రం నిజం కాదన్నారు. తమ పార్టీని కాసిం రిజ్వి స్థాపించలేదని అబ్దుల్‌ వాహెబ్‌ ఓవైసీ స్థాపించారని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ పని అయిపోయిందని, ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.