షోకాజ్‌ నోటీసులకు బెదిరేది లేదు

– సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలి: టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులిచ్చినా బెదిరేది లేదనీ, రెగ్యులర్‌ చేసేంత వరకు సమ్మె ఆపేది లేదని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ – సీఐటీయూ అనుబంధం) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి ఫసియుద్దీన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బెదిరించి సమ్మెను విరమింప చేయాలనుకోవడం ప్రభుత్వ అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్‌ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండ పునరాలోచించి చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి 33 జిల్లాల్లోని సమ్మె శిబిరాల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు పిలుపునిచ్చారు.
వైద్యారోగ్యశాఖలో వివిధ రకాల పేర్లతో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారితో మూడుసార్లు చర్చలు జరిపింది. అయితే వారి ప్రధాన డిమాండ్‌ రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వ వైఖరి సరిగా లేదనీ, ఏండ్ల తరబడి పని చేస్తున్న ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయకపోవడం అన్యాయమని యూని యన్‌ నాయకులు విమర్శించారు. చట్టబద్ధంగా 15 రోజుల ముందు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో సమ్మెకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని వారు హెచ్చరించారు.
విడుదల చేయాలి
హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద నిరసన తెలుపుతున్న 121 మంది ఏఎన్‌ఎంలను అరెస్టు చేయడాన్ని టీయుఎంహెచ్‌ఇయూ ఖండించింది. ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు ఎండీ ఫసియుద్దీన్‌, కె.యాదానాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్ట్‌ చేసిన వారందరిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.