– పిఎస్‌బిలతోనే సామాజికాభివృద్థి :ఎఐబిఒసి తెలంగాణ శాఖ వెల్లడి
నవ తెలంగాణ – బిజినెస్ బ్యూరో
భారత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వెన్నెముఖలా ఉన్నాయని.. అలాంటి బ్యాంక్‌ల జాతీయికరణపై విస్తృత చర్చను చేపట్టాలని నిర్ణయించామని ఎఐబిఒసి తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నెలకొన్నప్పటికీ బ్యాంక్‌ల జాతీయికరణ దినోత్సవం సందర్బంగా పలు చోట్లలో బ్యాంక్ అధికారులు మొక్కలు నాటడం, ర్యాలీలు, సదస్సులు నిర్వహించడం చేశారని వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ (ఎఐబిఒసి) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జి నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మాత్రమే సేవలందిస్తున్నాయని అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్థి చెందడానికి దోహదం చేస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం ముందూ, తర్వాత కూడా భారత బ్యాంక్‌లు ప్రయివేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 1969 జులై 19న అప్పటి కేంద్ర ప్రభుత్వం 14 బ్యాంక్‌లను ప్రభుత్వపరం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1980లో మరో 8 బ్యాంక్‌లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారన్నారు. ఈ నెల చివరి వరకు బ్యాంక్‌ల జాతీయికరణపై విస్తృత చర్చ చేపట్టాలని ఎఐబిఒసి కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ క్రమంలో విద్యా సంస్థల్లో సదస్సులు, ఇతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించామన్నారు. పిఎస్‌బిలు దేశ ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎఐబిఒసి నేతలు రాజ్ కుమార్, సతీష్, వెంకన్న, కె అంజనేయ ప్రసాద్, ఎం విక్రమ్, ఐ క్రిష్ణం రాజు, టి హనుమంతరావు, సిఆర్ భీమ్‌సింగ్, టిఎన్ రవి ప్రకాష్, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.