అంకిత భావమూ ఉండాలి

ప్రముఖ దర్శకులు ‘అంకురం’ ఉమామహేశ్వరరావు సారథ్యంలో అందరికీ అందుబాటులో, అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న ‘దాదా సాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌’ ఆరవ స్నాతకోత్సవం ఆదివారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌ వంటి పలు విభాగాల్లో సుశిక్షితుల్ని చేస్తూ, సినిమా రంగానికి ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణులను అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ స్నాతకోత్సవానికి నిర్మాత దిల్‌ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్రియేటివిటితో పాటు కషి, పట్టుదల, అంకితభావం ఉన్నవారిని మాత్రమే సినిమారంగం విజయాలు అందిస్తుందని ఈ సందర్భంగా దిల్‌ రాజు పేర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, దర్శక, నిర్మాత డాక్టర్‌ గౌతమ్‌ విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దాదా సాహెబ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌’ డీన్‌ మధు మహంకాళి, ప్రిన్సిపాల్‌ నందన్‌ బాబు సమక్షంలో పలువురు విద్యార్థినీ విద్యార్థులకు దిల్‌రాజు సర్టిఫికెట్స్‌, పతకాలు అందించారు. శిక్షణలో భాగంగా స్టూడెంట్స్‌ తెరకెక్కించిన లఘుచిత్రాలపై అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు.