భూతల్లి లోగిళ్ళు వీళ్లు

బువ్వకుండలున్న మెతుకులను
మాకందరికీ వెట్టి
మాయింట్లున్న నీళ్ళకుండకు
తన ఎతను జెప్పి
నీళ్ళు దాగి పండుకున్న
మా యమ్మను చూస్నప్పుడు
ఆడదాని ఓపికెందో తెల్సింది
ఊళ్ల్య ఆకతాయిల తోటి తిరిగితే
మాయక్క నా చెంపమీద గొట్టి
నాకు బుద్ధి జెప్పినప్పుడు
తప్పుచేస్తే ఆడది…….
ఆదిశక్తయితదని తెల్సింది
మా పొట్టాపతి దీర్వనీకే
కూలి పన్లకు పొయిన
మా నాయిన కొరకు
నదినెత్తిల సూరీడొచ్చి
ఎండ దంచుతున్న…..
బుక్కెడు బువ్వ తీస్కొని
పోయ్యేటి మా చెల్లె ను చూస్తే
ఆడది మమకారంకు మారుపేరని తెల్సింది
సిల్లులువడ్డ అంగిలకు
దారంతోటి మడ్షి కుట్టి
ఇంటిగుట్టు బయటపడకుండ
మా యామె తండ్లాడుతుంటే
ఆడదాని సంస్కారమేందో తెల్సింది
బరువులమూటలు మోస్తూ
సంసారం లోతు తెల్వకున్న
కడగండ్ల ను ఈదుకుంట
దారులు దెల్వకున్న
దూరాలను దాటుకుంట
బంధాలను సాలేడో లే అల్లుకుంట
పోతున్న మీకు గుండె నిండ
ఊపిరి పీల్వనీకే ……
ముడ్సుకున్న రెక్కలను
ఇప్పుకొని ఎగరనీకే
సమాజం చేయూత నిస్తే చాలు
అదే పదివేలు..!

– కొండాపురం లక్ష్మి, సంగారెడ్డి