అవి ఆంగ్లంలో రాసిన సంస్కృత పేర్లు

They are Sanskrit names written in English To the Standing Committee– స్టాండింగ్‌ కమిటీకి హోం కార్యదర్శి వివరణ
న్యూఢిల్లీ : క్రిమినల్‌ చట్టాల స్థానంలో మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మూడు బిల్లులకు పెట్టిన పేర్లపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి కేంద్ర హోం కార్యదర్శి అజరు భల్లా వివరణ ఇస్తూ బిల్లుల పేర్లు సంస్కృతంలోనే ఉన్నప్పటికీ వాటిని ఆంగ్ల భాషలో రాయడం జరిగిందని తెలియజేశారు. కాబట్టి రాజ్యాంగంలోని 348వ అధికరణను ఉల్లంఘించినట్లుగా భావించరాదని చెప్పారు.
మూడు రోజుల సమావేశాలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌ పలు అంశాలను ప్రస్తావించారు. బిల్లులకు హిందీ పేర్లు ఉండడమేమిటని నిలదీశారు. అన్ని బిల్లులు, సవరణలకు ఆంగ్ల భాషనే ఉపయోగించాలని రాజ్యాగంలోని ఆర్టికల్‌ 348 నిర్దేశిస్తోందని, కేంద్రం తన చర్య ద్వారా దానిని ఉల్లంఘించిందని మండిపడ్డారు.
‘బిల్లుల పేర్లు హిందీలో ఉన్నాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. మేము హిందీకి వ్యతిరేకం కాదు. అయితే బిల్లులు చట్టంగా మారితే హిందీ యేతర రాష్ట్రాల ప్రజలకు వాటిని ఉచ్చరించడం కష్టమవుతుంది’ అని మారన్‌ చెప్పారు. అయితే దీనిపై భల్లా స్పందిస్తూ అవి హిందీ పేర్లు కావని, సంస్కృత పదాలు అని వివరణ ఇచ్చారు. వాటిని ఆంగ్ల భాషలో రాసినందున ప్రజలందరూ సులభంగా చదవవచ్చని అన్నారు. దీనిపై మారన్‌ మాట్లాడుతూ దేశంలో కేవలం 21 వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడతారని గుర్తు చేశారు. బిల్లులపై కేవలం పదిహేను రోజులలో నివేదికలు అందజేయాలని కోరడంపై కూడా సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కీలక బిల్లులపై అధ్యయనం చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని, సమావేశానికి కొద్ది రోజుల ముందు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని వారు విమర్శించారు. దీంతో సభ్యులు తమ వెసులుబాటును బట్టి నివేదికలు అందజేయవచ్చునని ఛైర్మన్‌ తెలిపారు. కమిటీ తదుపరి సమావేశం సెప్టెంబర్‌ 11, 12 తేదీలలో జరుగుతుంది. కాగా స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్‌ పదవీకాలం సెప్టెంబర్‌ 12తో ముగుస్తున్నందున నూతన కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.