నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తో పాటు పార్టీ నేతల సమక్షంలో జీవన్ రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం పార్టీ శ్రేణులు నినాదాలతో సందడి చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
మధ్యాహ్నం పట్టణానికి చేరుకున్న కేటీఆర్ కు జీవన్ రెడ్డి నాయకత్వంలో వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు. పోతురాజు విన్యాసాలు, మంగలహారతులు, బతుకమ్మలతో 20వేల మంది మహిళలు నృత్యాలు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలూరు బై పాస్ రోడ్ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ కు భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ ఆధ్యంతం యువకులు టపాసులు పేలుస్తూ జైజీవన్న అని నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు.
రోడ్డుకు ఇరు వైపులా ఉన్న ప్రజలకు అభివందనం చేస్తూ ర్యాలీ అగ్రభాగాన ఎన్నికల ప్రచార రథంపై సాగిన కేటీఆర్ వేలాది మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. “అన్నా అని పిలిస్తే నేనున్నా అని వాలిపోయి సమస్యలు పరిష్కరించే నేత జీవన్ రెడ్డి. అనుక్షణం ప్రజల మధ్యే ఉంటూ మీకండగా నిలుస్తడు. జీవన్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు. ఆర్మూర్ అభివృద్ధి ముందుకు సాగాలంటే మళ్లీ జీవనే గెలవాలి. నియోజకవర్గం అభివృద్ధి కోసం కొట్లాడే నేతను మళ్లీ గెలిపించుకుంటేనే ఆర్మూర్ అభివృద్ధి మరింత ముందుకు సాగుతోంది” అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కర్ణాటక, బీజేపీ గుజరాత్ నోట్ల మాయలో పడకండి. కారు ఉండగా బేకారు గాళ్ళు వద్దు. పాలిచ్చే గేదెను అమ్మి కడుపులో పొడిచే దున్న పోతును కొనుక్కుందామా? కేసీఆర్ అనే సింహం సింగిల్ గానే వస్తుండు. బక్కపలచని కేసీఆర్ గొంతు నులమడానికిగుంపులు గుంపులుగా వస్తుండ్రు. మోడీ, అమిత్ షా,15మంది సీఎం లు, 20 మంది కేంద్ర మంత్రులు, యోగి,బోగి, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు తెలంగాణ కోసం ప్రశ్నించే కేసీఆర్ అనే ఏకైక గొంతు కోయడానికి గోతులు తొవ్వుతున్నారు. 11 చాన్స్ లు ఇస్తే 50 ఏండ్లు కరెంటు, సాగు, తాగు నీళ్లివ్వకుండా అరిగోస పెట్టిన కాంగ్రెస్ ఒక్క చాన్స్ అంటూ మళ్లీ రావడం సిగ్గుచేటు. కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలా?. ఆలోచించి ఓటేయండి అని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో తెలంగాణ బతుకుచిత్రం మారుస్తుందన్నారు. రూ.16 వేలకు “రైతు బంధు” పెంపుతో వ్యవసాయం మరింత బలోపేతం కానుంది. సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతీ నెలా రూ.3వేల భృతి ఇవ్వడం మహిళలకు వరం. ఆసరా పెన్షన్లు రూ.5వేలకు పెంపుతో ప్రతీ ఇంట్లో సంతోషం కనిపిస్తోంది. వికలాంగుల పాలిట దేవుడు కేసీఆర్. బీసీల పథకాలు, దళితబంధు పథకం యథావిధిగా కొనసాగింపు, గిరిజనేతరులకు కూడా పోడు భూములు ఇచ్చే అంశం పరిశీలిస్తా మనడం, ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షలకు పెంపు, అర్హులైన వారందరికీ రూ. 400కే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం వంటి పథకాలు రాబోతున్నాయి. అని అన్నారు’కేసీఆర్ బీమా ప్రతి ఇంటిటి ధీమా’ పేరుతో 93 లక్షల మందికి లబ్ధి జరిగేలా రూ. 5 లక్షల బీమా పథకం, అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు, ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు వంటివి పేదప్రజల బతుకు చిత్రం మార్చే నిర్ణయాలు అని కేటీఆర్ స్పష్టం చేశారు. నామినేషన్ కార్యాక్రమానికి అశేష జనవాహిని.. నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం నామినేషన్ వేసిన కార్యక్రమంలో అశేష జనవాహిని పాల్గొనడం బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. ముఖ్యంగా మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. నామినేషన్ వేయడానికి ముందు జీవన్ రెడ్డి తన ఆరాధ్య దైవమైన సిద్ధులగుట్ట శివుడికి పూజలు నిర్వహించి శివయ్య సన్నిధిలో బీ-ఫామ్ ఉంచారు. జీవన్ రెడ్డి తన సతీమణి రజితారెడ్డి, తన సోదరుడు రాజేశ్వర్ రెడ్డి తో కలిసి తల్లి తండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. తన చెల్లె బావల ఆశీర్వాదం కూడా పొందిన తరువాత సతీ మణి రజిత రెడ్డి, కుమార్తెలు అనౌశిక రెడ్డి , అనాణ్య రెడ్డి లతో కలిసి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెర్కిట్ లో గల హనుమాన్ ఆలయంలో, వెంకటేశ్వర కాలనీ లో గల వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు.