ముప్పేట దాడి..

Thirteenth attack..– ఎన్నికల వేళ సోదాలు, అరెస్టులు, వేధింపులు
– స్వామిభక్తిని ప్రదర్శిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు
– ప్రతిపక్ష నేతలే లక్ష్యం
సుప్రీంకోర్టు 2013లో సీబీఐని ‘పంజరంలో చిలుక’ అని అభివర్ణించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో ఆ చిలుక వేట కుక్కలా మారిపోయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపన్ను శాఖతో జత కలిసి ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఆ మూడు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకూ ఒకటే పని. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి, వారిని అష్టదిగ్బంధనం చేయడం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తంతు.. ఇప్పటికే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మారింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతోందా? ఈ దాడులు సహేతుకమైతే తప్పుపట్టాల్సిన పనిలేదు. దురుద్దేశపూరితమైతేనే ప్రమాదం. ప్రత్యేకించి ఎన్నికలవేళ.. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా సాగుతున్న దాడులను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : ప్రతిపక్ష నాయకులపై దర్యాప్తు సంస్థలు దాడి చేయడానికి ముందు బీజేపీ నేతలు వారిని నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. లొంగి వస్తే సరేసరి. లేకుంటే బెదిరిస్తారు. ఉదాహరణకు ఇటీవల మధ్యప్రదేశ్‌ పంచాయతీ శాఖ మంత్రి మహేంద్ర సింగ్‌ సిసోడియా కాంగ్రెస్‌ నాయకులకు ఓ అల్టిమేటం జారీ చేశారు. బీజేపీలో చేరాలని, లేకుంటే వారిపై ‘బుల్డోజర్‌’ దాడి తప్పదని హెచ్చరించారు. ఎన్డీఏలో చేరిన తర్వాత జనతాదళ్‌ (సెక్యులర్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి రెచ్చిపోతున్నారు.
తీహార్‌ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను రేపో మాపో అరెస్ట్‌ చేయబోతున్నారు. సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిరూపణకు నిలవని ఆరోపణలపై జైలుకు పంపుతుంటే ఇక ఈ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు సురక్షితంగా ఉంటాడు?. తరువాతి వంతు మమతా బెనర్జీ లేదా ఎంకే స్టాలిన్‌ది కావచ్చు. లేకుంటే సీనియర్‌ నేతలైన అఖిలేష్‌ యాదవ్‌ లేదా ఉద్ధవ్‌ ఠాక్రేకు ఇదే గతి పట్టవచ్చు. తన రాజకీయ బాస్‌ ఆదేశాల మేరకు ఈడీ ఎవరి పైన అయినా కేసులు పెట్టవచ్చు.
బీజేపీ నేతల జోలికి పోరా?
కేజ్రీవాల్‌ ఇటీవల ఓ మాట చెప్పారు. ‘ఈడీ మీద నాకు కేవలం ఒకే ఒక రోజు పెత్తనం ఇవ్వండి. బీజేపీ సీనియర్‌ నాయకులందరూ జైలులో ఉంటారు’. ఇవీ కేజ్రీవాల్‌ చెప్పిన మాటలు. పాలకులు ఈడీని తమ చెప్పుచేతల్లో ఉంచుకొని దానిని ప్రతిపక్షాలపై ఏ విధంగా ఉసిగొల్పుతున్నారో ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ సూటి ప్రశ్న వేశారు. ఒక్క బీజేపీ నాయకుడి ఇంటిలో కూడా ఈడీ ఎందుకు సోదాలు చేయడం లేదన్నది ఆమె ప్రశ్న. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల నివాసాలపై దాడులు చేయించడమే మీ ఉద్దేశమా? మీరు బూటకపు ఆధారాలతో కుట్రలు పన్నవచ్చు. మీకు వ్యతిరేకంగా మా వద్ద పెన్‌డ్రైవ్‌ల వంటి నికార్సయిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము వాటిని బయటపెట్టడం లేదు’ అని ఆమె అన్నారు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు ఓట్లను రాబట్టేందుకు బీజేపీకి ఉపయోగపడవని చెప్పారు.
సహాయకులను భయపెట్టి…
పాలకుల ఆదేశాలతో ఈడీ రహస్య కార్యకలాపాలు సాగిస్తుండడం మరో ప్రమాదకరమైన ధోరణి. ప్రతిపక్ష నేతల వద్ద గతంలో సహాయకులుగా పనిచేసిన వారిని నయానో భయానో ఒప్పించి, వారితో తప్పుడు సాక్ష్యం ఇప్పించి చివరికి కేసులు బనాయిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌పై చేసిన అవినీతి ఆరోపణ ఈ తరహాకు చెందినదే. బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చానంటూ ఓ వ్యక్తి చెప్పడంతో ప్రధాని, బీజేపీ ప్రతినిధి స్మృతి ఇరానీ నుండి కింది స్థాయి పార్టీ కార్యకర్త వరకూ ఆయనపై దాడి చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోసం హవాలా సొమ్మును ఉపయోగిస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆప్‌ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ సహాయకుడు చేసిన ఆరోపణ కూడా ఇలాంటిదే. రాజ్‌కుమార్‌ హవాలా మార్గంలో చైనాకు ఏడు కోట్ల రూపాయలు పంపారంటూ ఈడీ విచారణ సందర్భంగా ఆ సహాయకుడు చెప్పుకొచ్చాడు. ఈ ఆరోపణలకు నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయా అంటే అలాంటివేమీ లేవని అర్థమవుతోంది.
ఈడీ అధికారుల తీరు
ఈడీ మాజీ అధిపతి సంజరు కుమార్‌ మిశ్రా రెండు ‘ఘనకార్యాలు’ సాధించారు. ఒకటి బీయస్పీ అధినేత్రి మాయావతి నోరు మూయించడం. రెండు మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలను చీల్చడం. అజిత్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజబల్‌ వంటి పలువురు ఎన్సీపీ, శివసేన ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌లు, కేసులు నమోదయ్యాయి. అజిత్‌ పవార్‌ను పాతిక వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరికించారు. పటేల్‌పై మనీ లాండరింగ్‌ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత వీరు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో పవిత్రులైపోయారు. విచారణ నుండి రక్షణ పొందారు. ఇప్పుడు ఈడీ అధిపతిగా వచ్చిన రాహుల్‌ నవీన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం కనుసన్నల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిపక్షాలకు సన్నిహితంగా ఉండే సంస్థలు, వ్యక్తులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.
దాడులే అస్త్రంగా…
ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేకించి కర్నాటకపై దృష్టి కేంద్రీకరించాయి. అక్కడి ప్రభుత్వం శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిధులు సమీకరిస్తోందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రతిపక్షాలను భయాందోళనలకు గురిచేయడానికి ఎన్నికలకు ముందు ఈ దాడులను ఓ అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల దాడులు ఎక్కువయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలకు ఐదు రోజుల ముందు ఈడీ ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా ఓ రాజకీయ పార్టీకి ఈ డబ్బు పంపారని ఆరోపించింది. తెలంగాణలో ఈ నెల 2న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లపై దాడులు చేశారు. ఎంత సొమ్ము స్వాధీనం చేసుకున్నదీ వెల్లడించలేదు. రాజస్థాన్‌లో జల జీవన్‌ మిషన్‌కు చెందిన 25 ప్రదేశాలపై ఈ నెల 3న ఈడీ దాడి చేసింది. దీనికి ప్రతిగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏసీబీని ప్రయోగించింది. పదిహేను లక్షల రూపాయల లంచం తీసుకున్నారంటూ ఇద్దరు ఈడీ అధికారులను అరెస్ట్‌ చేసింది. ఓ వైపు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై, ప్రచారాన్ని ఉధృతం చేస్తుంటే మరోవైపు దర్యాప్తు సంస్థలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులను ముమ్మరం చేస్తున్నాయి.
రాజస్థాన్‌లో ఒకే రోజు పీసీసీ అధ్యక్షుడు, ఇతర కాంగ్రెస్‌ నేతల నివాసాలపై వేర్వేరు కేసుల్లో ఈడీ దాడులు చేసింది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ కుమారుడు రతుల్‌ పురీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో పాటు ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు, ఢిల్లీ పోలీసులు ముప్పేట దాడి చేస్తున్నారు. రాజస్థాన్‌ మంత్రి రాజేంద్ర యాదవ్‌పై మధ్యాహ్న భోజన పథకం కుంభకోణం కేసు పెట్టారు. ఆ రాష్ట్రంలో మొత్తంమీద తొమ్మిది మంది నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు నడుస్తున్నాయి. వారిలో ముఖ్యమంత్రి గెహ్లాట్‌ కుమారుడు, సోదరుడు, మంత్రులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నేతలు, మంత్రులు జైళ్లలోనో లేదా ఈడీ నిఘాలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రులు జైలులో కాలం గడుపుతున్నారు. ఇప్పుడు నాలుగో మంత్రిపై దాడులు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ను అరెస్ట్‌ చేసిన తర్వాత బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ ‘ఈ లెక్కన చూస్తే మమతా బెనర్జీ కేబినెట్‌ సమావేశాన్ని జైలులో నిర్వహించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
దెబ్బతింటున్న విశ్వసనీయత
న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఇటీవల ఓ విషయాన్ని బయటపెట్టారు. తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీని ఈడీ విచారించింది. ఆ సమయంలో ఈడీ అధికారులు ఆయనకు ఓ ఆప్షన్‌ ఇచ్చారట. అదేమంటే బీజేపీలో చేరండి లేదా విచారణను ఎదుర్కోండి అని. ఇలాంటి ఉదంతాలు దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను దెబ్బ తీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మహారాష్ట్రలో బీజేపీలోకి ఫిరాయించిన ఓ నేత బహిరంగంగానే ఏమన్నారంటే…’నేను ఇప్పుడు బీజేపీ ఎంపీని. ఈడీ నన్ను ఏమీ చేయలేదు’. కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?