దేశంలోనే ఇసుక పాలసీ బెస్ట్‌  పారదర్శకంగా ఈ-వేలం

E-Auction is the best sand policy in the country–  సరసమైన ధరలకే ప్రజలకు అందించాలి
–  ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలి : గనుల శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానంలో దేశంలోనే బెస్ట్‌ అని, ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి. మహేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్‌, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇసుకను సరసమైన ధరలకే అందించాలని ఆదేశించారు. గనులు, భూగర్భ వనరుల శాఖపై శుక్రవారం ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గనుల శాఖ డైరెక్టర్‌ కాత్యాయని, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన ఖనిజ బ్లాక్‌ల వేలంలో భాగంగా అవసరమైన పర్యావరణ అనుమతుల గురించి కూడా అధికారులతో మంత్రి చర్చించారు. రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయం అని అభిప్రాయపడ్డారు. ఈ శాఖలో ఖాళీగా ఉన్న 127 అధికారులు, సిబ్బంది పోస్టుల భర్తీ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సాంకేతికతను అనుసంధానం చేసి గనులు, భూగర్భ వనరుల శాఖను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్‌లైన్‌ విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉండటం కూడా మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. టీఎస్‌ఎండీసీ సంస్థ దేశంలో పలు అవార్డులను తెచ్చుకోవడం హర్షనీయమని అని అన్నారు. గత ఏడేండ్ల కాలంలో గనుల శాఖ ద్వారా రూ.5,444 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే రాష్ట్రంలో 101 రీచ్‌ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిఘా పెట్టి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామని మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జోక్యంగా చేసుకుంటూ ఆన్‌లైన్‌ విధానాన్ని మరింత పటిష్టం చేయాలని చెప్పారు. అలాగే సీసీ కెమెరాలను పకడ్బందిగా ఉపయోగించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వివరించారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక తదితరాలకు అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.