ఇదో విప్లవాత్మక పథకం

– రైతుబంధు పథకానికి ఐదేండ్లు
– అత్యంత ప్రభావితం చేసే పథకాలలో ఇదొక్కటి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయరంగంలో ఒక విన్నూత్నమైన, విప్లవాత్మకమైన రైతుబంధు పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తయిందని రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చెరువుల మరమ్మతులు, పెండింగ్‌ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు నిర్మించడం, ఆ తర్వాత పెట్టుబడి సాయమందించడం ద్వారా వ్యవసాయాన్ని పండుగలా చేయవచ్చనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంవత్సరానికి ఎకరాకు రూ.10వేల చొప్పున 70 లక్షల మంది రైతులకు 10 విడుతల్లో 65,500 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మొదలుపెట్టిన ఈ పథకాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రభావితం చేసే పథకాలలో ఇదొక్కటని పలువురు ప్రముఖులు కీర్తించారని గుర్తు చేశారు. పంట విస్తీర్ణంలో 2014-15లో 131.34 లక్షల నుంచి 2022 – 23 లో 209 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. వరి దిగుబడిలో ప్రథమ స్థానానికి చేరుకుందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 7000పైగా వరి ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఇంతటి అద్భుతమైన పథకాన్ని రాష్ట్ర రైతాంగానికి అందించిన సీఎం కేసీఆర్‌కు యావత్‌ తెలంగాణ రైతాంగం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

రైతన్నను రాజును చేసింది మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని పండగ చేసి రైతన్నను రాజును చేసిందంటూ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ఏడాదికి ఎకరాకు 10వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతల్లో రూ.65వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్‌ మోడల్‌ అయిందని పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తున్నాయని పేర్కొన్నారు. అబ్‌ కీ బార్‌…కిసాన్‌ సర్కార్‌ అంటూ బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తున్నాయని పేర్కొన్నారు.