– కేఆర్‌ఎమ్‌బీకి ప్రాజెక్టులను అప్పగించటం రాష్ట్రానికి గొడ్డలిపెట్టే
– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరిక
– 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ
– జయప్రదానికి మాజీ సీఎం పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎమ్‌బీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటమనేది ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేక వైఖరేనని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు ఇది తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ఈ వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు వీలుగా ఈనెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ సభను జయప్రదం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. నాడు ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మాజీ సీఎం పిలుపునిచ్చారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగట్టాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కృష్ణా బేసిన్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. కృష్ణా నదిపైగల ప్రాజెక్టులను కేఆర్‌ఎమ్‌బీకి అప్పగించటం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాలను, ఇతర పర్యవసాలను ఆయన ఈ సందర్భంగా వారికి వివరించారు. రైతాంగ ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాగు, తాగునీటి హక్కులకోసం పోరాడటమే కాకుండా ‘మా నీళ్లు మాకే…’ అనే ప్రజా నినాదాన్ని ఎత్తుకున్నామని గుర్తు చేశారు. స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే ఆ నినాదాన్ని నిజం చేసి చూపించామని తెలిపారు. కేఆర్‌ఎమ్‌బీ పేరుతో కృష్ణా నదీ ప్రాజక్టులపై తెలంగాణ హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తాము తిప్పికొట్టామని వివరించారు. అనేక ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేండ్లపాటు నీటి వాటాలను కాపాడేందుకు కృషి చేశామని చెప్పారు,. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవగాహన రాహిత్యంతో తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా మద్దతుతో ఇలాంటి చర్యలను తిప్పికొడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయకుమార్, సత్యవతి రాథోడ్‌తోపాటు ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.