– పార్టీ మారుతున్నారంటూ ప్రచారం
– ఖండించిన పలువురు ఎమ్మెల్యేలు
– కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో వీరు పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యేలు దాన్ని ఖండించారు. కాగా వీరందరూ కేసీఆర్‌తో భేటీ కావడానికి ఫాంహౌస్‌కు వెళ్లినట్టు సమాచారం. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మాత్రం కారు జోరే కొనసాగింది. జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయ కేతనం ఎగరేశారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. మల్కాజిగిరి, ఉప్పల్ నుంచి కొత్త వారు అసెంబ్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడ్డారు. మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్న సీనియర్లకు సైతం నిరాశే మిగిలింది. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ఇద్దరు కొత్త వారు సైతం ప్రతిపక్షంలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో వారు పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. జిల్లాలో సైతం జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్టు చర్చ నడిచింది. దీన్ని వారు తీవ్రంగా ఖండించారు. కాగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్‌లో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓటమికి గల కారణాలపై చర్చించినట్టు సమాచారం.
ఆ వార్తలను ఖండిస్తున్నా : మల్లారెడ్డి
పలు వార్తా పత్రికల్లో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై మల్లారెడ్డి స్పందించారు. తాను ఎప్పుడూ బీఆర్‌ఎస్, కేసీఆర్‌తోనే ఉంటానని తెలిపారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, నాయకులు నమ్మొద్దని చెప్పారు.
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : మర్రి రాజశేఖర్‌రెడ్డి
తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంతో పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను ఎప్పుడూ బీఆర్‌ఎస్, కేసీఆర్, కేటీఆర్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.