ఆ రెండు పార్టీలవి పగటి కలలే..

– బీజేపీ, కాంగ్రెస్‌లకు పరాభవం తప్పదు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే ఎన్నికల్లో గెలవటం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు వేటికవే పగటి కలలు కంటున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలకూ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు భూపాలపల్లి పర్యటన సందర్భంగా తమ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైనా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రయివేటీకరించకుండా చూస్తామంటూ ఆయన ప్రగల్భాలు పలికారని అన్నారు. వాస్తవానికి ఆ సంస్థకు సంబంధించిన నాలుగు బ్లాకులను బహిరంగ వేలం ద్వారా ప్రయివేటుకు అప్పగించేందుకు కుట్ర పన్నింది ఎవరంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే అందుకు పూనుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వాస్తవాన్ని మరిచిన బండి సంజరు… నిస్సిగ్గుగా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ ప్రజలను అన్ని విషయాల్లోనూ మోసం చేస్తున్నది బీజేపీ, ప్రధాని మోడీయేనని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కదాన్నైనా అమలు చేశారా..? అని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ నేతలు… సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేయటం అత్యంత శోచనీయమని అన్నారు. మీడియాలో ప్రచారం కోసమే ఇలాంటి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి వంద సీట్లు ఖాయమంటూ గండ్ర ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రంతో చర్చించేందుకే మంత్రి కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారని ఆయన చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమమని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ దంపతులు… బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారనే వార్తలపై అడగ్గా… ‘దాని గురించి తనకేమీ తెలియదని’ సమాధానమిచ్చారు.