కన్నడ రచయితలకు బెదిరింపు లేఖలు..

– నిందితుడి హిందూత్వ సంస్థ కో కన్వీనర్‌
బెంగళూరు : కర్నాటకలో హత్య చేస్తానంటూ పలువురు రచయితలకు గత కొంతకాలంగా బెదిరింపు లేఖలు రాస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇటీవలే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) అధికారులు శివాజి రావు జాదవ్‌ (41)ను దావణగెరెలో అరెస్టు చేశారు. జాదవ్‌ దావణగెరె జిల్లా హిందూత్వ సంస్థ కో కన్వీనర్‌ కావటం గమనార్హం. 8వ తరగతి మధ్యలో ఆపేసిన జాదవ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. గతంలో జాదవ్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. అతని తండ్రి దావణగెరె నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గ్రూపు-డీ ఉద్యోగి. రచయితలందరికీ జాదవ్‌ బెదిరింపు లేఖలు రాశాడని బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ బి.దయానంద తెలిపారు. నాలుగు జిల్లాలవ్యాప్తంగా అనేక పోస్టు బాక్స్‌ల దగ్గర పెట్టిన సీసీటీవీ నిఘా ద్వారా నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసి 13 రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపారు. రచయితలను హత్య చేస్తానని బెదిరిస్తూ లేఖలు రాసేవాడని కమిషన్‌ తెలిపారు.