– మాజీ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరణ
– భోపాల్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తల నిరసన
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ల రగడ ఆ పార్టీకి తలనొప్పిగా మారుతున్నది. సోన్‌కచ్ నుంచి మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర వర్మకు టికెట్ నిరాకరించడాన్ని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. భోపాల్‌లోని వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. భోపాల్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ చీఫ్ వి.డి శర్మ, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, నరేంద్ర సింగ్ తోమర్‌లు సమావేశమయ్యారు. ఈ సమయంలోనే కార్యకర్తల నుంచి నిరసన ఎదురుకావటం గమనార్హం. ఒక్క రాజేంద్ర వర్మ విషయమే కాదు.. రాష్ట్రంలోని మహారాజ్‌పూర్, ఛత్తర్‌పూర్, బండా, సుమావలి, సబల్‌ఘర్, లాంజీ, పంధుర్నా, సౌన్సర్‌తో సహా ఇతర స్థానాల నుంచి టిక్కెట్లు నిరాకరించబడిన బీజేపీ నాయకులు కూడా పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. వారి అనుచరులు, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు అధిష్టానం తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించడాన్ని నిరసిస్తూ దేవాస్ జిల్లా సోన్‌కచ్-ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్తలు 400-450 వాహనాల కాన్వారులో భోపాల్‌కు వెళ్లారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి గ్రామ సర్పంచ్‌లు, ఇతర స్థానిక నాయకుల వరకు ఉన్న కార్మికులు.. వర్మకు తిరిగి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, అధికార బీజేపీలో ఈ టికెట్ల పంచాయితీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.