టై ‘హార్ట్‌’ బ్రేక్‌

Tie heart break– టైబ్రేక్‌లో ఓడిన ప్రజ్ఞానంద
– విజేతగా మాగస్‌ కార్ల్‌సన్‌
– ఫిడె చెస్‌ ప్రపంచకప్‌
బాకు (అజర్‌బైజాన్‌) :టైబ్రేక్‌లో హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది. 18 ఏండ్ల కుర్రాడు, అత్యంత పిన్న వయసులోనే చెస్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ పోరులో చేరిన చెన్నై చిన్నోడు.. ఆఖరు అడుగులో తడబడ్డాడు. ఫిడె చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ మాగస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) చేతిలో రమేశ్‌బాబు ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యాడు. 1.5-2.5తో మాగస్‌ కార్ల్‌సన్‌పై పైచేయి సాధించటంతో విఫలమయ్యాడు. టైబ్రేక్‌లో తొలి గేమ్‌లోనే విజయం సాధించిన మాగస్‌ కార్ల్‌సన్‌.. అంచనాలను తారుమారు చేస్తూ కెరీర్‌ తొలి ప్రపంచకప్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే అద్వితీయ విజయంపై కన్నేసిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద.. రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. నగదు బహుమతిగా రూ.66 లక్షలు సొంతం చేసుకున్నాడు. చెస్‌ ప్రపంచకప్‌ రన్నరప్‌గా ప్రజ్ఞానంద.. వచ్చే ఏడాది జరుగనున్న క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత.. చైనా గ్రాండ్‌ మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడాల్సి ఉంటుంది.
మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రజ్ఞానంద.. రన్నరప్‌గా నిలిచాడు. తొలి రెండు గేమ్‌లు డ్రా కావటంతో విజేతను తేల్చేందుకు గురువారం టైబ్రేక్‌ నిర్వహించారు. టైబ్రేక్‌లో భాగంగా తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద ఆరంభంలో మంచి పొజిషన్‌లో నిలిచాడు. చదరంగం బోర్డుపైనా, టైమ్‌ పరంగా మనోడిదే పైచేయి కనిపించింది. కానీ చివర్లో కార్ల్‌సన్‌ అనూహ్య ఎత్తు వేశాడు. గుర్రాలను కదిపి ప్రజ్ఞానందకు సవాల్‌ విసిరాడు. పది సెకండ్ల సమయం ఉండగా ప్రజ్ఞానంద తప్పుకోవటంతో నార్వే స్టార్‌కు గెలుపు దక్కింది. ఇక రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన కార్ల్‌సన్‌.. డ్రాతో చిద్విలాసం చేశాడు. వరల్డ్‌ నం.2 హికరు నకముర, వరల్డ్‌ నం.3 ఫాబియానలపై విజయంతో చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి చేరిన 18 ఏండ్ల ప్రజ్ఞానంద.. రన్నరప్‌గా వేటను ముగించాడు. చెస్‌ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రమేశ్‌ బాబు ప్రజ్ఞానందనకు సోషల్‌ మీడియా వేదికగా అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.