టైగర్‌ దండయాత్ర మొదలైంది

రవితేజ, నూతన దర్శకుడు వంశీ కాంబినేషన్‌లో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతున్న పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ గ్లింప్స్‌ యావత్‌ దేశాన్ని షేక్‌ చేశాయి. అలాగే ది గ్లోరీ ఆఫ్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ థీఫ్‌-టైగర్‌ నాగేశ్వరరావు గ్లింప్స్‌ విడుదలై అందర్నీ అలరించింది. తాజాగా రిలీజైన టీజర్‌తో టైగర్‌ దండయాత్ర మొదలైంది. హైదరా బాద్‌, ముంబై, ఢిల్లీ, దేశంలోని అనేక ప్రాంతాలలో దొంగతనాలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు మద్రాస్‌ సెంట్రల్‌ జైలు నుండి పరారీలో ఉన్నారనే వార్తా కథనంతో టీజర్‌ ప్రారంభమవు తుంది. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో పోలీసులు షాక్‌ అవుతారు. టైగర్‌ జోన్‌లో పనిచేసిన మురళీశర్మ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా టైగర్‌ నాగేశ్వరరావులోని అరుదైన నైపుణ్యాలను వివరిస్తారు.’నాగేశ్వరరావు పాలిటిక్స్‌లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్స్‌లో గెలిచేవాడు. స్పోర్ట్స్‌లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్‌ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదష్టవశాత్తు, వాడొక క్రిమినల్‌ అయ్యాడు’ అని టైగర్‌ నాగేశ్వరరావు సామర్థ్యాలను మురళీ శర్మ వివరిస్తారు. టైగర్‌ నాగేశ్వరరావు చిన్నతనంలోనే నేరాలు చేయడం ప్రారంభించడంతో చిన్నప్పటి నుంచి వైల్డ్‌ స్వభావం కలిగి ఉంటాడు. రైలు ఎపిసోడ్‌ పాత్ర ధైర్యాన్ని చూపిస్తుంది. రవితేజ సరసన నూపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన- దర్శకత్వం : వంశీ, నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌.