అప్పు కట్టకుంటే తీహార్‌ జైలుకే..

Tihar Jail if you don't pay the debt..– 22లోగా క్రెడిట్‌ సూస్సెకు రుణం చెల్లించాల్సిందే
– మీరు చచ్చినా బాధపడేది లేదు : స్పైస్‌జెట్‌ చైర్మెన్‌కు సుప్రీం తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ : విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌ అజరు సింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. యూరోపియన్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూస్సెకు ఈ నెల 22లోగా 5,00,000 డాలర్ల వాయిదా మొత్తం సహా డిఫాల్ట్‌ అయినా 10 లక్షల డాలర్లు (రెండూ కలిపి దాదాపు రూ.12 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. లేదంటే తీహార్‌ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సోమవారం సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు విక్రమ్‌ నాథ్‌, అహ్సానుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ”క్రెడిట్‌ సూస్సె వద్ద తీసుకున్న రుణం చెల్లించకుంటే మేం తదుపరి తీవ్రమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సంస్థను మూసేసినా మాకు ఆందోళన లేదు. ఈ దాగుడు మూతల వ్యవహారం ఇక చాలు. మీరు షరతులకు కట్టు బడి ఉండాల్సిందే. మీరు ఒకవేళ చనిపోయిన మేం బాధపడం.. ఇది చాలా తీవ్రమైన అంశం. ఇకపై జరిగే ప్రతీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.’ అని అజరు సింగ్‌ను ఉద్దేశించి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2015 నుంచి క్రెడిట్‌ సూస్సె, స్పైస్‌జెట్‌ మధ్య న్యాయ వివాదం కొనసాగుతోంది. స్సైస్‌జెట్‌ తమకు 24 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 200 కోట్లు) బకాయిలు చెల్లించాల్సి ఉందని క్రెడిట్‌ సూస్సె ప్రకటిం చింది. దీనిపై మద్రాస్‌ హైకోర్టును ఆ బ్యాంక్‌ ఆశ్రయించింది. 2021లో స్పైస్‌ జెట్‌ సంస్థను మూసేయాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ స్పైస్‌జెట్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాలు చర్చింకుని పరిష్కారానికి రావాలని సూచించింది. కాగా.. గతేడాది ఆగస్టులో ఇరు పక్షాలు వివాద పరిష్కారానికి అంగీకారానికి వచ్చినట్లు సుప్రీంకోర్టుకు తెలి పాయి. అయినప్పటికీ ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కూడా స్పైస్‌జెట్‌ బకాయిలు చెల్లించలేదు. స్పైస్‌జెట్‌ నిర్లక్ష్య తీరుపై ఈ ఏడాది మార్చిలో క్రెడిట్‌ సూస్సె సుప్రీంకోర్టును ఆశ్రయించి.. కోర్టు దిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారించిన సుప్రీం బెంచ్‌.. అజరు సింగ్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తిరిగి ఈ కేసును సెప్టెంబర్‌ 22న విచారించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.