అహ్మదాబాద్: గర్భ విచ్ఛిత్తి (అబార్షన్) చేయించుకు నేందుకు అనుమతించాల్సిందిగా ఓ లైంగికదాడి బాధితురా లు చేసిన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శనివారం అత్యవసర విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే సమయం మించిపోయిందని వ్యాఖ్యానించింది. బాధితురాలి అభ్యర్థనపై నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు అతి విలువైన 12 రోజుల సమయం తీసుకోవడంపై అసంతృప్తి, ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విచారణ జరిపింది. బాధితురాలి తరఫున న్యాయవాది శశాంక్ సింగ్ వాదనలు వినిపిస్తూ అబార్షన్‌కు మెడికల్ బోర్డు సిఫార్సు చేసిందని, అయినా హైకోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చిందని తెలిపారు. గర్భిణి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కునేందుకు ఈ నెల 8వ తేదీన హైకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిందని చెప్పారు. వైద్యులు ఆమెను పరీక్షించి 10వ తేదీన నివేదిక అందజేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ ‘నివేదిక అందినట్టు 11వ తేదీన హైకోర్టు రికార్డులలో నమోదు చేశారు. కానీ విచారణను 12 రోజులు ఆలస్యం చేస్తూ 23వ తేదీకి వాయిదా వేశారు. గర్భస్థ శిశువు వయసు 28 వారాలకు చేరుతున్న దశలో ఒక్క రోజు జాప్యం జరిగినా నష్టమేనన్న వాస్తవాన్ని హైకోర్టు విస్మరించడం ఆశ్చర్యంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది.
ఈ నెల 17న పిటిషన్ తిరస్కరణకు గురైనట్లు కేసు స్టేటస్ ద్వారా తెలుసుకున్నామని, అయితే దానికి హైకోర్టు కారణం చెప్పలేదని, ఇప్పటికీ హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆ ఆదేశాలను అప్‌లోడ్ చేయలేదని న్యాయవాది వివరించారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ ‘అసలు ఆగస్ట్ 23వ తేదీ వరకూ ఈ కేసును ఎలా వాయిదా వేశారు? అప్పటికి ఎన్ని విలువైన రోజులను బాధితురాలు నష్టపోయింది?’ అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులను రొటీన్ కేసుల మాదిరిగా చూడరాదని తెలిపారు. బాధితురాలిని పరీక్షించిన మెడికల్ బోర్డు నివేదికను తనకు అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రీని సంప్రదించి కోర్టు ఆదేశాల స్టేటస్‌ను పరిశీలించాల్సిందిగా సెక్రటరీ జనరల్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.