బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం

– బృందా కరత్‌ పిటిషన్‌లో ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు సుప్రీం ఆదేశం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాని కోరుతూ సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు సమయం మంజూరు చేసింది. 2020లో ద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై బిజెపి నేతలు అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేశ్‌ వర్మలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) నేత .బృందా కరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ కు సమయం ఇచ్చింది. బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలంటూ బృందా కరత్‌ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన ట్రయల్‌ కోర్ట్‌ ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారించింది. ఢిల్లీ పోలీస్‌ కమిషన్‌ తరపున హాజరైన న్యాయవాది హాజరై, కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం కోరారు. అందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ అంశాన్ని తదుపరి ఆగస్టు 14న జాబితా చేయాలని ఆదేశించింది. అనుమతి లేదని పేర్కొంటూ ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించేందుకు మేజిస్ట్రేట్‌ నిరాకరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తున్నప్పుడు, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి అనుమతి అవసరమన్న మేజిస్ట్రేట్‌ వైఖరి సరికాదని సుప్రీంకోర్టు ప్రాథమికంగా పేర్కొంది. నిందితులపై ఎలాంటి నేరం జరగలేదని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన స్టేటస్‌ రిపోర్టును మేజిస్ట్రేట్‌ వాస్తవానికి అంగీకరించలేదని కూడా బెంచ్‌కు విచారణ చివరి తేదీలో సమాచారం అందింది. ”దేశ్‌ కే గద్దరోన్‌ కో, గోలీ మార్‌నా సలోన్‌ కో” (దేశద్రోహులను..కాల్చిచంపేయండి)అంటూ నినాదాలు చేస్తూ అనురాగ్‌ ఠాకూర్‌ 2020 జనవరి 27 నాటి ప్రసంగంతో సహా ఇద్దరు రాజకీయ నాయకులు చేసిన పలు ప్రసంగాలను కరత్‌ తన అభ్యర్థనలో పేర్కొన్నారు. 2020 జనవరి 27- 28 తేదీలలో బిజెపి ప్రచారం చేస్తున్నప్పుడు, ఆ తరువాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్వేష్‌ వర్మ చేసిన మరో ప్రసంగం గురించి కూడా ప్రస్తావించారు.