సకాలంలో వర్షాలు రాక…

– 5 లక్షల ఎకరాల పంట ఎండు మొఖం
– వర్షం కోసం 40 రోజులుగా నిరీక్షణ
– లక్షల ఎకరాలలో ఎండుతున్న మిర్చి, పత్తి పంటలు
– నాగర్‌కర్నూల్‌, గద్వాలలో అధిక నష్టం
– ప్రత్యమ్నాయ చర్యల కోసం రైతుల పాట్లు
నీటివనరులు లేక సకాలంలో వర్షాలు రాక పత్తి, మిర్చి పంటలు ఎండుదశకు చేరుకున్నాయి. 40 రోజులుగా వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పూత, కాత దశలో సాగు నీరు లేక పత్తి పంట ఎకరాకు 20 క్వింటాళ్లు రావల్సి ఉండగా మూడు నాలుగు క్వింటాళ్లకు మించి వచ్చే అవకాశాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చెరువులు, పిల్టర్‌ బోర్లనుండి సాగునీటిని అందిస్తున్నారు. అయినా ఇంకా 5 లక్షల ఎకరలాకు ఎటువంటి సాగు నీటి ఏర్పాట్లు లేవు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌పై ఆశలు వదులుకునే స్థితి నెలకొందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పత్తి, మర్చి పంటను అధికంగా సాగు చేస్తారు. నల్లభూములు ఉండే బిజనపల్లి, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాల పరిధిలో పత్తి, మిర్చి పంటలు అధికంగా సాగువతాయి. ఈప్రాంతంలో కెఎల్‌ఐ ద్వారా కాల్వల ద్వారా పాలెం,నాగనూల్‌,నాగర్‌కర్నూల్‌ వంటి చెరువులను నింపు తున్నారు. నింపిన నీటిని పొలం పనులకు మళ్లీంచడానికి చిన్న కాల్వల నిర్మాణం జరగలేదు. దీంతో పంటలకు సాగునీరు అందే అవకాశాలు లేవు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలలో పత్తి, లక్ష ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశారు. పంటలు సాగు చేసిన తర్వాత బలమైన వర్షాలు కురువలేదు. ఈసాలు నీళ్లు ఆసాలు మీదికి పారలేదు. నీళ్లు లేక పత్తి కాయలు రాలిపోతున్నాయి. మిర్చి పంటలు ఎండిపోతున్నాయి. మిర్చి పంట ఎకరాకు 50 వేల పెట్టుబడి పెడితే పత్తికి ఖర్చు 40 వేలు దాటింది. ఒక వర్షం వస్తే… ఉమ్మడి జిల్లాలో కోట్లలో ఆదాయం వస్తోంది. వర్షాలు లేకపోవలడంతో రైతులు ప్రత్యమ్నాయ సాగునీటికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా బోరు బావులు, చెరువులు ఫీల్టర్‌ పాయింట్ల ద్వారా సాగునీటిని మల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల,బాలనగర్‌, రాజాపూర్‌, భూత్పూర్‌, మూసాపేట మండలాల పరిధి లోనూ…పత్తి , మిర్చి పంటలు అధికంగా సాగు చేస్తారు. ఈ ప్రాంతానికి ఎటువంటి సాగునీటి ప్రాజెక్టులు లేవు. భూగర్జ జలాలు భారీగా పడి పడిపోయాయి. చెరువులు, కుంటలు ఇక్క్డడ కనిపించవు. ఖరీఫ్‌ పంటలు పూర్తిగా వర్షాదారం మీదనే ఆధారపడి సాగు చేస్తారు. ఇక గద్వాల, నారా యణపేట, వనపర్తి జిల్లాల పరిధి లోనూ.. ఇదే పరిస్థితి నెలకొంది. పంటలేవీ పూర్తి స్థాయిలో చేతికి వచ్చే స్థితి లేదు.

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వరి,పత్తి, మిర్చి పంటలను అధికంగా సాగు చేస్తారు. 40 రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుదశకు చేరుకున్నాయి. ముఖ్యంగా పత్తి ఇప్పటికే ఎండిపోయింది. చెట్టుకు నాలుగు ఐదు కాయలకు మించి లేదు. ఇక కాత దశలో ఉన్న మిర్చి సైతం నీరు లేక ఎండిపోతున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం చెల్లించేవిదంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం.
కోడేరు శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్‌