దళిత – గిరిజనుల్లో వెలుగులు నింపేందుకే

To enlighten the Dalit-Tribals– ప్రజలు జెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలి
– అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ
– నెలకు రూ. 4 వేల పెన్షన్‌
– పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట బీఆర్‌ఎస్‌ నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్‌ అమలు చేసి దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. దళితులు, గిరిజనుల జీవితాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా దళిత-గిరిజన డిక్లరేషన్‌ ప్రకటించినట్టు తెలిపారు. సోమవారం నాగర్‌కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత తమదేనన్నారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌ బాధితులు, పైలేరియా డయాలిసిస్‌ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామని వెల్లడించారు.
కేసీఆర్‌ ఖేల్‌ ఖతం – బీఆర్‌ఎస్‌ దుఖాన్‌ బంద్‌ : రేవంత్‌ ట్వీట్‌
యావత్‌ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని, ”కేసీఆర్‌ ఖేల్‌ ఖతం – బీఆర్‌ఎస్‌ దుఖాన్‌ బంద్‌” అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌పై కేటీఆర్‌ విమర్శలు చేసిన నేపథ్యంలోనే మంత్రిని ట్యాగ్‌ చేస్తూ రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. తమ డిక్లరేషన్‌ దళిత – గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్‌ అని తెలిపారు. దళితుడ్ని సీఎం చేస్తాననీ. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ పెంచుతామని మోసం చేయడం లాంటిది కాదంటూ పరోక్షంగా బీఆర్‌ఎస్‌ మోసం చేసిందని గుర్తుచేశారు. మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేయడం, నేరెళ్ల ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత, బీసీలపై థర్‌ డిగ్రీ ప్రయోగించడం, కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అసైన్డ్‌ భూములు లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు అమ్ముకోవడం, దళిత మరియమ్మ లాకప్‌డెత్‌, ఒక్క మాదిగకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం. దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లు తీసుకోవడం వంటి డిక్లరేషన్‌ కాదు మాదని స్పష్టం చేశారు.
దళితుల భూములు తిరిగివ్వాలి
– కిసాన్‌ కాంగ్రెస్‌
దళితుల భూములను తిరిగివ్వాలనీ, ధరణితో హక్కులు పొందలేని వారికి హక్కు పత్రాలివ్వాలనీ, పంటలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ అన్వేష్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు గోస కార్యక్రమంలో తీర్మానించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరీ, జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ వైస్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లి గ్రామా దళిత రైతులు భూములు కోల్పోయామనీ, ఆరుట్ల ప్రాంతానికి చెందిన తండ వాసులు ధరణితో భూమి హక్కులు రాలేదనీ, గజ్వేల్‌ నియోజకవర్గం వర్గల్‌ మండలంలో భూములు లాక్కున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్ట్‌ కింద వున్నా రైతులు శాస్త్రీయంగా చెక్‌ డ్యాములు నిర్మించకపోవడంతో భూములు కోతకు గురై ఇసుకమేటలు పెట్టి సాగుకు పనికి రాకుండా పోయినట్టు తెలిపారు. బాల్కొండ వేములవాడ మంథని నియోజకవర్గ్గాలకు చెందిన రైతులు తమకు నష్టపరిహారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని నాయకులు వారికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్‌ చైర్మెన్‌ బెల్లయ్య నాయక్‌, ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ నగరి ప్రీతం తదితరులు పాల్గొన్నారు.