ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే తమ కాళ్ల మీద తాము నిలడాలి. ముఖ్యంగా మహిళలు దీనిపై దృష్టి పెట్టాలి. ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటే ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు చాలా కష్టంగా మారుతుంది. ఆర్థిక విషయాల గురించి ఇంటి కోసం ప్రత్యేకంగా ఓ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. సంపాదనకు తగ్గట్టు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆపదలూ, అవసరాన్ని సమన్వయం చేసుకుంటూ ఆర్ధిక ఒత్తిడి ఇంటికి తగలకుండా చూసుకోవాలి. అలాంటి కొన్ని ఆర్థిక క్రమశిక్షణ కోసం పాటించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకుందాం…
ఏ నెల జీతం ఆ నెలే ఖర్చయితే భవిష్యత్తులో చాలా కష్టం. అందుకే ఖర్చులు తగ్గించుకుంటూ కొంత పొదుపు కేటాయించుకోవాలి. అలాగని నెలకు ఎంతో కొంత మొత్తాన్ని తీసి పొదుపు చేస్తే చాలు. అదే ఆర్థిక ప్రణాళిక అనుకుంటారు చాలా మంది. కానీ ఇది కాదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల జాబితా సిద్ధం చేసుకోవాలి. వచ్చే ఆదాయంలో కనీసం ముప్పై శాతమైనా పొదుపు కోసం కేటాయించుకోవాలి. మీ స్థాయికి తగ్గట్టు ఎంతైనా పెట్టుబడిగా పెట్టొచ్చు. ఏడాదికేడాది దీన్ని పెంచుకుంటూ వెళ్లడం వల్ల ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. ఇలా కాకుండా అప్పు చేసి మదుపు చేయడం, అవసరానికి మించి ఖరీదైన వస్తువులు కొనడం వంటివి మీ జీవితాన్ని కల్లోలం చేస్తాయి. ఇది పెట్టుకొని లెక్కలు వేయాలి.
ప్రతిదీ రాయాల్సిందే
చాలా మందికి డబ్బు లెక్కలు పెద్దగా పట్టవు. ఆదాయం, ఖర్చుల వివరాలు రాయడం అసలే ఇష్టం ఉండదు. విలాసాలు, అవసరాలకు మధ్య తేడానూ గుర్తించరు. ఇలాంటప్పుడు చిక్కుల్లో పడటం ఖాయం. మీరూ అలా చేస్తుంటే వెంటనే మీ పద్ధతి మార్చుకోండి. ఆదాయ, వ్యయాల మధ్య సమతూకం కుదరాలంటే ప్రతీ ఖర్చూ కచ్చితంగా రాసుకోవల్సిందే.
మీరే నిర్ణయించుకోవాలి
నేటి అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ వ్యయాలనూ అంచనా వేయాలి. ఉదాహరణకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనడం స్వల్పకాలిక అవసరం. సొంతిల్లు, కారు కొనాలనుకోవడం మధ్య కాలిక లక్ష్యాలు. పదవీ విరమణ, పిల్లల వివాహం దీర్ఘకాలిక వ్యూహాలు. మీ ఇంటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని మీరే నిర్ణయించుకోవాలి. వీటిపై స్పష్టత వస్తేనే మన దగ్గర ఉన్న వనరుల్ని ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది. వాటిని ప్రతి రెండు నెలల కోసారి సమీక్షించుకోవాలి. ఖర్చుల నియంత్రణ సూత్రాన్ని ఇంట్లోని ప్రతి ఒక్కరూ పాటించేలా చూసుకోవాలి.
ముందుగానే ఊహించండి
ప్రణాళికా బద్ధంగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మధ్యలో ఏదో చిన్న కష్టమొచ్చిందని వాటిని వెనక్కి తీసుకుంటారు చాలా మంది. అలా చేయొద్దు. ఈ తీరు మీ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా ఇలాంటి పరిస్థితుల్ని ముందుగానే ఊహించుకోవడం అలవాటు చేసుకోండి. వీటిని దాటేయడానికి కొంత అవ్యవసర నిధిని ఏర్పరుచుకోండి. మీ కుటుంబ బడ్జెట్‌లో దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. దాన్ని ఆపత్కాలంలో ఆరు నెలల పాటు రోజువారీ జీవితాన్ని గడపడానికీ, వాయిదాల చెల్లింపులకు ఉపయోగపడేలా సిద్ధం చేసుకోండి. అప్పుడే మీ లెక్క తప్పదు.
ఆన్‌లైన్ షాపింగ్‌తో జాగ్రత్త
ఏ వస్తువు కొన్నా ఆచితూచి కొనడం మహిళలకు అలవాటే. కానీ ఈ మధ్య ఆన్‌లైన్ షాపింగ్ మన ఆలోచనల్ని మార్చేస్తుంది. అవసరమున్నా లేకున్నా కొనేస్తున్నాం. ఇందుకు ఆకర్షణీయమైన చిత్రాలూ, ప్రకటనలూ, రాయితీలు వంటివి ఏవైనా కావొచ్చు. ఈ వ్యాలెట్లలో డబ్బులు నింపి ఉంచడం, ఆయా షాపింగ్ వెబ్‌సైట్లలో కార్డుల వివరాలు నమోదు చేయడం, ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్లు తీసుకోవడం వంటి సదుపాయం వల్ల కూడా త్వరపడి కొనేస్తుంటాం. వాటికి దూరంగా ఉండండి. ఒకవేళ ఏదైనా కొనాలనుకున్నా వాయిదాలు చెల్లించేలా కాకుండా పొదుపు చేసి కొనడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మీ బడ్జెట్ పద్దుల్ని తలకిందులు కానివ్వవు.