– కమ్యూనిస్టులే నిజమైన వారసులు
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. నాడు సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య స్పష్టంచేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా రంగశాయిపేట ఆ పార్టీ స్థానిక కమిటీ ఆధ్వర్యంలో ఏరియా కమిటీ కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన ఆర్టీఏ జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్గొన్న నాగయ్య మాట్లాడుతూ.. ఆనాడు.. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు.. బ్రిటీషర్లు, నిజాం, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేశారని, దాని ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని తెలిపారు. కులమతాలతో సంబంధం లేకుండా భూమి కోసం, విముక్తి కోసం జరిగిన చారిత్రక పోరాట చరిత్రను కూడా ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ.. బీజేపీ దాని అనుబంధ సంఘాలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, విభజన రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న జీ 20 అంతర్జాతీయ సదస్సులో ‘విద్వేషాలు వద్దు’ అనే తీర్మానాన్ని ప్రధాని మోడీ ప్రవేశపెట్టి, అమోదించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ధర్మారపు సాంబమూర్తి, ఏరియా కమిటీ సభ్యులు గణేపాక ఓదెలు, మాలోతు ప్రత్యుష, మన్నూరు జ్యోతి, రత్నం, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షకార్యదర్శులు అనీల్, దుర్గయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు చుక్క ప్రశాంత్, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామ సందీప్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కూన రాధిక, కేవీపీఎస్ ఏరియా కార్యదర్శి ఉసిల్ల కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ గజ్జ చందు, శాఖ కార్యదర్శులు, పార్టీ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.