నేడు గ్రూప్‌-4 రాతపరీక్ష

– 9.51 లక్షల మంది దరఖాస్తు
– 2,846 కేంద్రాల ఏర్పాటు
– 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-4 పోస్టులకు రాతపరీక్ష శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌ పీఎస్సీ) ఏర్పాట్లను పూర్తి చేసింది. శనివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2ను ఓఎంఆర్‌ ఆధారంగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అయితే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు పేపర్‌-1కు ఉదయం 9.45 గంటల్లోపు, పేపర్‌- 2కు మధ్యాహ్నం 2.15 గంటల్లోపు పరీక్షా కేంద్రా లకు చేరుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థులను అనుమ తించరు. పేపర్‌-1కు ఉదయం ఎనిమిది గంటల నుంచి పేపర్‌-2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు భద్రతా సిబ్బందికి, గదిలోకి వెళ్లాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపు కార్డును చూపించాలి. ఈ పరీక్షకు అభ్యర్థు లు భారీగా హాజరు కానుండడంతో వేలిముద్రను తప్పనిసరి చేశారు. ఓఎంఆర్‌ పత్రంలో బ్లూ/బ్లాక్‌ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్‌, హాల్‌టికెట్‌, ప్రశ్నాపత్రం నెంబర్‌ రాయాలి. హాల్‌టికెట్‌, ప్రశ్నాపత్రం నెంబర్‌ సరిగా రాయకున్నా, బ్లూ/బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ కాకుండా ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, పెన్సిల్‌ ఉపయోగిం చినా ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కాదు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులను అభ్యర్థులు తీసుకెళ్ల కూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకుని రాకూడదు. గ్రూప్‌-4 రాతపరీక్ష నిర్వహించే పరీక్షా కేంద్రాలున్న విద్యాసంస్థలకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటించింది. వచ్చేనెల ఎనిమిదిన రెండు శనివా రాన్ని పనిదినంగా పరిగణించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్‌ ఒకటిన నోటిఫికేషన్‌ ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్‌-4కు రాష్ట్రవ్యాప్తంగా 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు 9,01,051 (94.72 శాతం) మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50,154 (5.27 శాతం) మంది డౌన్‌లోడ్‌ చేసుకోలేదని వివరించారు. 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.