డీఎస్సీ దరఖాస్తుకు నేడే ఆఖరు

– ఇప్పటి వరకు 1.71 లక్షల మంది అప్లై
– ఎస్జీటీకి 64,770, ఎస్‌ఏకు 88,424 దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) దరఖాస్తు చేసే గడువు శనివారంతో ముగియనుంది. శుక్రవారంతో ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 1,76,599 మంది దరఖాస్తు ఫీజు చెల్లించారనీ, వారిలో 1,71,564 మంది దరఖాస్తులను సమర్పించారని వివరించారు. 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) పోస్టులకు 64,770 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. 611 లాంగ్వేజ్‌ పండితులు (ఎల్పీ) పోస్టులకు 11,899 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. 164 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టులకు 6,471 దరఖాస్తులొచ్చాయని వివరించారు. 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు 88,424 మంది కలిపి మొత్తం 5,089 ఉపాధ్యాయ పోస్టులకు 1,71,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు.
5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ ఆరో తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. గతనెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చేనెల 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో జరిగే రాతపరీక్షలను విద్యాశాఖ వాయిదా వేసింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. త్వరలోనే వాటికి సంబంధించిన తేదీలను ఖరారు చేసి ప్రకటించే అవకాశమున్నది. ఎన్నికల నేపథ్యంలో వచ్చేనెల రెండు, మూడు తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 రాతపరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వాయిదా వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి ఆరు, ఏడు తేదీల్లో గ్రూప్‌-2 రాతపరీక్షలను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది.