నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు బుధ, గురువారం రెండురోజులపాటు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులను జారీ చేయాలంటూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈనెల 20 నుంచి వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమ, మంగళవారం మాత్రమే విద్యాసంస్థల్లో తరగతులను నిర్వహించారు.
ఇప్పుడు మళ్లీ బుధ, గురువారం రెండురోజులపాటు సెలవులు ప్రకటించడం గమనార్హం. అందుకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలన్నింటికీ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. సెలవులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈవోలను ఆమె ఆదేశించారు. అయితే ఈనెల 28న మొహర్రం తొమ్మిదో రోజు ఐచ్ఛిక సెలవు, శనివారం మొహర్రం పదో రోజు సాధారణ సెలవు, మరుసటి రోజు ఆదివారం. దీంతో వచ్చే సోమవారం విద్యాసంస్థలు తెరుచుకుంటాయని చర్చ జరుగుతున్నది.