నేటి ఛలో డైరెక్టరేట్‌ తాత్కాలికంగా వాయిదా

జీవో 142 రద్దు పోరాట కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గురువారం తలపెట్టిన ఛలో డైరెక్టరేట్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జీవో 142 రద్దు పోరాట కమిటీ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె.యాదానాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఛలో డైరెక్టరేట్‌ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు బుధవారం మధ్యా హ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సంయుక్త సమావేశం నిర్వహించి జీవో 142కు సంబంధించిన పూర్తి వివరాలపై చర్చించినట్టు తెలిపారు. పూర్తి అనేక్జర్స్‌ ఇచ్చేందుకు డీహెచ్‌ అంగీకరించినట్టు తెలిపారు. క్యాడర్లకు సంబంధించిన సలహాలు, సూచనలను యూనియన్లు, అసోసయేషన్ల తరపున జీవో 142 రద్దు పోరాట కమిటీ లెటర్‌ హెడ్‌పై 15వ తేదీలోపు సమర్పించాలని డీహెచ్‌ సూచించినట్టు చెప్పారు. దీంతో కమిటీలోని నాయకులందరి ఏకాభిప్రాయం మేరకు ఛలో డైరెక్టరేట్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వివరించారు.