నాటి గడీలే.. నేటి ఫామ్‌హౌజ్‌లు

 కేసీఆర్‌ వెలిగిపోతుండు.. ప్రజలు నలిగిపోతుండ్రు
 రాష్ట్రంలో సీలింగ్‌ యాక్ట్‌ అమల్లో ఉందా? లేదా?
 కమీషన్ల కోసం ప్రాణహితను చంపేసిన కేసీఆర్‌:సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
 రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో కొనసాగిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర

నవతెలంగాణ-షాబాద్‌
రాష్ట్రంలో ఫామ్‌హౌజ్‌ల పేరిట నాటి గడీల పునర్‌నిర్మాణం జరుగుతున్నదని, ఇది తెలంగాణ పునర్నిర్మాణం ఎట్టా అవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌ మండలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైతాబాద్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డితో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ సంస్కరణల చట్టం, సీలింగ్‌ యాక్ట్‌ అమలులో ఉందా? లేదా? ప్రశ్నార్థకంగా మారిందా అన్న అనుమా నం వ్యక్తం అవుతుందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చందనవెల్లిలో పేద ప్రజలు సాగు చేసుకోవడానికి సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన రెండు వేల ఎకరాల భూములను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెజ్‌ పేరిట ఆ భూములను తిరిగి లాక్కుందని విమర్శించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ అనేక గ్రామాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన లక్షల ఎకరాల భూమిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సెజ్‌ల పేరిట సంపన్నులకు కట్టబెట్టేందుకు బలవంతంగా తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజల సంపద దోపిడీ చేస్తూ ముఖ్యమంత్రి కుటుంబం వెలిగిపోతుందని, నాలుగు కోట్ల ప్రజలు రాజ్య హింసలో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చందనవెళ్లి భూనిర్వాసితుల పక్షాన సంబంధిత దర్యాప్తు సంస్థలకు సీఎల్పీ నేతగా తాను లేఖ రాస్తానని, గవర్నర్‌ని కూడా కలుస్తామని, అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఈ అవకతవకలపై లేఖ రాస్తానని వెల్లడించారు. ధరణిని స్కామ్‌గా మార్చిన దాని రూపకర్త, మాజీ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్న తర్వాత తిరిగి ప్రభుత్వం చీఫ్‌ అడ్వైజర్‌గా తెచ్చుకోవడం భూ కుంభకోణాల నుంచి కాపాడుకోవడం కోసమేనని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. తక్షణమే ఆయనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాణం తీశారని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లాకు జూరాల నుంచి నీళ్లు ఇస్తామని కొన్నాళ్లు.. పాకాల నుంచి ఇస్తామని మరికొన్నాళ్లు.. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇస్తామని, కుర్చీ వేసుకుని అక్కడే ఉండి పనులు చేయిస్తానని చెప్పిన కేసీఆర్‌ పదేండ్లు కావస్తున్నా రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద మొదటి పంపు నిర్మాణమే ఇంకా కాలేదన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ భూసేకరణ జరగలేదన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో అత్యంత స్వల్పంగా రావడంతో బాధ్యత కలిగిన మంత్రిగా సబితాఇంద్రారెడ్డి కనిపించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, పీసీసీ అధికార మాజీ ప్రతినిధి పామెన భీంభరత్‌, చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు సున్నపు వసంతం, షాబాద్‌ దర్శన్‌ పాల్గొన్నారు.