కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా టమాటాలు పంచారు..

– 3డీ స్క్రీన్‌పై మంత్రికి శుభాకాంక్షలు
– థ్రిల్‌ సిటిలో తలసాని సాయికిరణ్‌ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు
– హాజరైన మంత్రులు మహమ్మద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌…రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు
నవతెలంగాణ-మట్టెవాడ/ బేగంపేట్‌
మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మంత్రులు ఆలయాల్లో పూజలు చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పలుచోట్ల టమాటాలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ పీవీ మార్గ్‌లోని థ్రిల్‌ సిటీ థీమ్‌ పార్క్‌లో వినూత్నంగా జరిపారు. ఈ వేడుకలకు హౌంమంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అతిపెద్ద 3డీ తెరపై 3డీలో కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కేటీఆర్‌ పనితీరు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక సాంగ్‌ను ప్రదర్శించారు. అనం తరం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేక్‌ను సాయి కిరణ్‌ యాదవ్‌తో కలిసి మంత్రులు కట్‌ చేశారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. కేటీఆర్‌ గొప్ప నాయకుడు అన్నారు. రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమల ఏర్పాటు, ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఎంతో మంది యువతకు కేటీఆర్‌ స్పూర్తిగా నిలిచారన్నారు.
ప్రపంచ రికార్డ్‌ సాధించిన రూబిక్స్‌ క్యూబ్‌ ఆర్టిస్ట్‌ ఇర్ఫాన్‌ కుట్టి కండ్లకు గంతలు కట్టుకొని రూబిక్‌ క్యూబ్స్‌తో రూపొందించిన కేటీఆర్‌ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఇర్ఫాన్‌ కుట్టిని మంత్రులు సత్కరించి అభినందించారు. అదేవిధంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద వివిధ ఛానళ్లకు చెందిన వెయ్యి మంది వీడియో కెమెరామెన్‌లకు ఒకొక్కరికి రూ.10 లక్షల రిస్క్‌ కవరేజ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డులను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, ఎగ్గే మల్లేశం, స్టీఫెన్‌ సన్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేషన్‌ చైర్మెన్‌లు గజ్జెల నగేష్‌, కోలేటి దామోదర్‌ గుప్తా, అనిల్‌ కుమార్‌ కూర్మాచలం, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత రెడ్డి, నగర గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ప్రసన్న, కార్పొరేటర్‌లు హేమలత, టి.మహేశ్వరి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.అలాగే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్‌లో రక్తదాన శిబిరాన్ని మంత్రి సత్యవతి ప్రారంభించారు. గిప్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌.. అంతర్గా మండలం గోలివాడ గ్రామంలో పేద ఒంటరి మహిళ గాదెం రాజమ్మకు ఇల్లు కట్టించి ఇచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవనలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి పేద మహిళలకు టమాటాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్యులు కేటీఆర్‌ రాష్ట్రానికి ఎనలేని కృషి చేస్తూ యువతకు ఉపాధి కల్పించడం కోసం ప్రపంచ దేశాల నుంచి పెద్దపెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారన్నారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలోనూ టమాటాలు పంపిణీ చేశారు.