– 200 ఫ్రాంచైజీ స్టోర్ల ఏర్పాటు లక్ష్యం
– ఔత్సాహిక యువత కోసం శిక్షణ కేంద్రం
– సెల్‌కాన్ సిఎండి వై గురు వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
మల్టీ మొబైల్స్ రిటైల్ చెయిన్ టచ్ మొబైల్స్‌ను ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సెల్‌కాన్ గ్రూప్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. తమ విస్తరణ వ్యూహంలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుందని సెల్‌కాన్ గ్రూప్ సిఎండి వై గురు అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేనితో కలిసి గురు మీడియాతో మాట్లాడారు. టచ్ మొబైల్స్‌కు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 42 అవుట్‌లెట్లు ఉన్నాయన్నారు. వచ్చే మార్చి ముగింపు నాటికి దక్షిణాదిలో మరో 200 ఫ్రాంచైజీ స్టోర్లను, సొంతగా మరో 50 అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశ వ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టనున్నామన్నారు. రూ.15 లక్షల మొత్తంతో ఫ్రాంచైజీ తెరవడానికి వీలు కల్పిస్తున్నామన్నారు. యువ ఔత్సాహికవేత్తలకు, టెక్నిషన్లకు అవకాశాలు కల్పించనున్నామన్నారు. 2022-23లో సెల్‌కాన్ గ్రూప్ రూ.2,600 కోట్ల ఆదాయం ఆర్జించిందని.. 2023-24లో రూ.5,000 కోట్లు అంచనా వేస్తున్నామన్నారు. గతేడాది టచ్ మొబైల్స్ రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేసిందన్నారు. మొబైల్స్ సర్వీస్, విక్రయాలలో సమగ్ర శిక్షణ అందించడానికి హైదరాబాద్, తిరుపతి నగరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. 10వ తరగతి, ఐటిసి చేసిన వారికి నైపుణ్యాలు అందించి.. వారికి ఉపాధిని కల్పించనున్నామన్నారు. ప్రతీ ఏడాది 500-1000 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్దేశించుకున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల ఆధ్వర్యంలో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు, ఎపి ప్రభుత్వం నుంచి రూ.125 కోట్ల ఆర్డర్లను కలిగి ఉన్నామన్నారు.