సెట్విన్‌తో లక్షా 20 వేల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఉపాధి

సెట్విన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేణుగోపాలరావు
మెరిట్‌ సర్టిఫికెట్ల ప్రదానం
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
సెట్విన్‌ సంస్థ లక్షా 20 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ వృత్తి విద్యా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు ఇచ్చిందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వేణుగోపాలరావు అన్నారు. రాష్ట్ర అవతరణ దతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్‌ ప్రధాన కార్యాలయంలో గతేడాది సంస్థలో శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిం చిన మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కోర్సుల వారీగా మెరిట్‌ సర్టిఫికెట్లను ప్రదానం చేసే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సెట్విన్‌ ఆధ్వర్యంలో సుమారు 50 కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నా మన్నారు. ఈ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సబ్జెక్ట్‌లో అన్ని కేంద్రాలను కలిపి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 మే వరకు లక్షా 20 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ వృత్తి విద్యా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ అందించామన్నారు. వీరిలో అనేక మంది విదేశాల్లో కూడా ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో డీజీల్‌ మెకానిక్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, ఆటో ఎలక్ట్రిషియన్‌ తదితర కోర్సులకు మంచి డిమాండ్‌ ఉండటంతో ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిపో యారన్నారు. రాష్ట్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో సెట్విన్‌ ముందంజలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్‌ ఎంఎ. మోయిజ్‌, సూపరింటెండెంట్‌ పిబిఎస్‌. ప్రసాదావు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.