కొత్త ఎస్సై, కానిస్టేబుళ్లకు అక్టోబరులో శిక్షణ

– పీటీసీలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కొత్తగా నియమితులవుతున్న ఎస్సైలు, కానిస్టేబుళ్లకు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో శిక్షణను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ మంగళవారం తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని 28 పోలీసు ట్రైనింగ్‌ కాలేజీ(పీటీసీ)లను సిద్ధంగా ఉంచాలని ఆ కాలేజీల ప్రిన్సిపాళ్లను డీజీపీ ఆదేశించారు. ఈ విషయమై సీనియర్‌ పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర ట్రైనింగ్‌ ఐజీ తరుణ్‌ జోషి, పీటీసీ కాలేజీల ప్రిన్సిపాళ్ళతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో తాజాగా 14,881 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లకు సంబంధించిన నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రెండు విడతలుగా ఇప్పటి వరకు దాదాపు 28 వేల మంది ఎస్సైలు, కానిస్టేబుళ్ల నియామకాలు జరిపామని ఆయన చెప్పారు. శాంతి భద్రతలు సవ్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని త్రికరణశుద్ధిగా విశ్వసించిన ప్రభుత్వం అందుకు సంబంధించి పోలీసు శాఖకు అన్ని విధాలా సహాయ, సహకారాలను, నిధులను కేటాయిస్తున్నదని తెలిపారు. తాజాగా రిక్రూట్‌ అవుతున్న ఎస్సైలు, కానిస్టేబుళ్ల శిక్షణ కోసం పీటీసీలలో అవసరమైన మౌలిక సదుపాయాలను, శిక్షణా, సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని డీజీపీ అధికారులను కోరారు. అలాగే, అన్ని కాలేజీలకు వైట్‌ కలర్‌ వేయటంతో పాటు అవసరమైన మరుగుదొడ్లను కూడా అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. కొన్ని కాలేజీలలో సిబ్బంది కొరత ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.