రేపటినుంచి ఎస్‌ఏల బదిలీలు

– 28,29 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదు
– 33 జిల్లాల్లో ప్రభుత్వ టీచర్లు, మల్టీజోన్‌-1లో స్థానిక ఉపాధ్యాయులకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గురువారం నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 28, 29 తేదీల్లో బదిలీల కోసం ఎస్‌ఏలు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులకు ఈనెల 28 నుంచి బదిలీల కోసం వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ వెబ్‌ ఆప్షన్లను 33 జిల్లాల్లోని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు, మల్టీజోన్‌-1లోని 19 జిల్లాల్లో ఉన్న స్థానిక సంస్థల పరిధిలోని ఉపాధ్యాయులకు అవకాశం కల్పించామని వివరించారు. బదిలీల కోసం వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 28, 29 తేదీల్లో అవకాశముం టుందని పేర్కొన్నారు. ఆప్షన్ల సవరణకు ఈనెల 30న అవకాశం కల్పించామని తెలిపారు. అవసరమైన ఉపాధ్యాయులు వారు నమోదు చేసిన ఆప్షన్లను సవరణ చేసుకోవచ్చని సూచించారు. బదిలీల్లో పాల్గొనే స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులందరూ ఈ విషయాన్ని గమనించి, వెబ్‌ ఆప్షన్లను నమోదు చేయాలని కోరారు. స్పౌజ్‌ పాయింట్లు వాడుకునే ఉపాధ్యాయులు, వారి స్పౌజ్‌ పనిచేస్తున్న పాఠశాలకు దగ్గరగా ఉండే బడులను మాత్రమే ఆప్షన్లుగా ఎంచుకోవాలని సూచించారు. స్పౌజ్‌ కేటగిరి ఉపయోగించుకున్న ఉపాధ్యాయులు నమోదు చేసిన ఆప్షన్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారికి బదిలీ ఉత్తర్వులు అందజేయబడతాయని స్పష్టం చేశారు. కావున జిల్లాలోని స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులు, ఈ విషయాలను జాగ్రత్తగా గమనించి, వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈవోలను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ (జీహెచ్‌ఎం) గ్రేడ్‌-2ల బదిలీల ప్రక్రియను నిర్వహించారు. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 1,218 మందికి జీహెచ్‌ఎం గ్రేడ్‌-2 పదోన్నతులు లభించాయి.