వణుకుతున్న ఉత్తరాది

– ముంచెత్తుతున్న భారీ వర్షాలు..15 మంది మృతి
– హిమాచల్‌లో కొట్టుకుని పోయిన దుకాణాలు, కార్లు
– ఢిల్లీలో 41 ఏండ్ల తరువాత రికార్డు స్థాయి వర్షపాతం
– జమ్మూకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హర్యానాల్లోన కుండపోత
 న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్ర, శనివారాలతో పాటు ఆదివారం కూడా ఉత్తరాదిలో అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలకు ఆదివారానికి గత 24 గంటల్లో 15 మంది మరణించారు. అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ రాష్ట్రంలో వరదల ఉధృతి తీవ్రంగా ఉంది. వరద నీటికి అనేక దుకాణాలు, కార్లు కొట్టుకునిపోయాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో 41 ఏండ్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. జమ్మూకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాలను భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయానికి గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 153 మీమీ వర్షపాతం నమోదయింది. 1982 నుంచి ఒక రోజు వర్షపాతం విషయంలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. 1982 జులై 25న 24 గంటల వ్యవధిలో 169.9 మీమీ వర్షపాతం కురిసింది. దాని తరువాత ఇదే అత్యధిక వర్షపాతం. భారీ వర్షాలతో ఢిల్లీలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలతో పాటు, అండర్‌పాస్‌లు, పార్కులు, రోడ్లు పూర్తిగా జలమయ్యాయి. భారీ వర్షాలు కారణంగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో గత మూడు రోజుల నుంచి ఎడతేరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆదివారం నాటికి రాష్ట్రంలో తొమ్మిది మంది మరణించారు. ఇండ్లు కూలడం, కొండచరియలు విరిగిపడ్డం వంటి ప్రమాదాల్లో వీరు మృతి చెందారు. వర్షాలతో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారి 21ను అధికారులు మూసివేశారు.
వరదల్లో పలు దుకాణాలు, కార్లు కొట్టుకుని పోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఉధమ్‌ సింగ్‌లో ఒక ఇల్లు కూలి ఇద్దరు మరణించారు. రాజస్థాన్‌లో ఆదివారం ఉదయానికి గత 24 గంటల్లో వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో 2,3 రోజుల వరకూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని వాతావారణ శాఖ హెచ్చరించింది.
జమ్మూకాశ్మీర్‌లో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ఆదివారం ఉదయానికి గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు సైనికులు కూడా ఉన్నారు. ఆకస్మిక వరదలకు పూంచ్‌ ప్రాంతంలో ఇద్దరు సైనికులు మరణించగా, డోడా జిల్లా కొండచరియలు పడి ఇద్దరు మరణించారు. ఆదివారం కూడా అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. దీంతో వరుసగా మూడు రోజుల పాటు ఈ యాత్ర నిలిచిపోయినట్లయింది. యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా 17 రైళ్లను రద్దు చేసినట్టు నార్తర్న్‌ రైల్వే శాఖ ప్రకటించింది. మరో 12 రైళ్లను దారి మళ్లించినట్టు తెలిపింది.