పెరిగిన ప్రయివేటు పెట్టుబడులు

– ప్రయోజనాలు మాత్రం విదేశీ కంపెనీలకే
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో దేశంలో ప్రయివేటు పెట్టుబడులు బాగా పెరిగాయి. ఈ పెట్టుబడులు ప్రధానంగా రవాణా రంగంలో…అంటే విమానయాన రంగంలో వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఆర్థిక పరిశోధనా విభాగం తెలిపింది. అయితే తొలి త్రైమాసికంలో వచ్చిన ఈ పెట్టుబడులు దేశంలో నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు ఉపయోగపడలేదు. దేశానికి చెందిన అన్ని ఆర్డర్లు విదేశాలలోని కంపెనీలకే వెళ్లాయి. ఈ పెట్టుబడులతో విదేశీ కంపెనీలు కొత్తగా విమానాల ఉత్పత్తి చేపడతాయి. మరో మాటలో చెప్పాలంటే ఈ ప్రయివేటు పెట్టుబడులు విదేశీ కంపెనీలకే ప్రయోజనం చేకూరుస్తాయి. 2022-23లో ప్రయివేటు రంగానికి చెందిన పెట్టుబడులు బాగా పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మరో నివేదిక తెలిపింది. 2019, 2020 సంవత్సరాలలో ప్రయివేటు పెట్టుబడులు తగ్గాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నివేదిక ప్రస్తావించింది. 2021లో పరిస్థితి కొంతమేర ఆశాజనకంగా ఉందని, అది 2022లోనూ, ఈ సంవత్సరం కూడా కొనసాగిందని వివరించింది. అయితే 2016, 2017 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పటికీ ప్రయివేటు పెట్టుబడుల ప్రవాహం తక్కువగానే ఉన్నదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో రూ.5.96 లక్షల కోట్ల ప్రయివేటు పెట్టుబడులు వచ్చాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు రూ.5.79 లక్షల కోట్లు. తొలి త్రైమాసికంలో ప్రకటించిన నూతన ప్రాజెక్టులలో 74% రవాణా రంగానికి సంబంధించినవే. విద్యుత్‌ రంగంలో 10%, రసాయనాల రంగంలో 8%, యంత్రాల రంగంలో 3%, ఆటో రంగంలో 2% మేర పెట్టుబడులు వచ్చా యి. ప్రయివేటు కంపెనీలు రుణాలు సేకరించి పెట్టుబడులు పెడుతు న్నాయి. రుణాలు లభించకపోతే పెట్టుబడులు పెట్టవు. ఈ సంవత్సరం బాండ్‌ మార్కెట్‌ నుంచి ప్రయివేటు కంపెనీలు రూ.2.33 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

Spread the love