గిరిజన సమస్యలను పరిష్కరించాలి

– ఎస్టీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్‌, ఆర్‌ శ్రీరాం నాయక్‌, నాయకులు వి రామ్‌కుమార్‌, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ అంజయ్య నాయక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి క్రిష్టినా చోంగ్తూను కలిసి వినతి పత్రం సమర్పించారు. పోడుభుముల హాక్కుపత్రాలను ఎలా పంపిణీ చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రభుత్వం జూన్‌ 24 నుంచి 30 వరకు పత్రాలను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించినా ఇంతవరకు జిల్లా స్థాయిలో ఎక్కడ,ఎవరిద్వారా పంపిణీ చేస్తున్నారు? అనే విషయం తెలియడం లేదన్నారు. లబ్ధిదారుల లిస్టులను గోప్యంగా ఉంచడం వల్ల ఆందోళన నెలకొన్నదని గుర్తుచేశారు. అసెంబ్లీలో సీఎం ప్రకటించిన విధంగా 11.50 లక్షల ఎకరాల పై హక్కులు కల్పించే విధంగా నోడల్‌ అధికారిగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు. గత రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రైకార్‌ రుణాలను తక్షణం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకోసం యాక్షన్‌ ప్లాన్‌ను ప్రకటించాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గురుకులాలు, కాలేజీ హాస్టళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులందరికీ సీట్లు ఇవ్వాలని కోరారు. గురుకులాలు, హాస్టళ్లు సరిపడా లేనందున నూతన భవనాలను నిర్మించాలని, ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు అనుబంధంగా హాస్టల్‌ భవనాలను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన బెస్ట్‌ అవైలబుల్‌ పథకంలో 6వేల సీట్లు మాత్రమే ఉన్నాయనీ, దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా 15 వేలకు పైగా ఉన్న నేపథ్యంలో మరో 2,000 సీట్లను తక్షణం పెంచాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని జిల్లాల్లో అవినీతికి పాల్పడుతున్న డీటీడీఓ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.