నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు శనివారం ఉదయం బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులర్పించారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ముందుగా బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఆ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు అమరులను గుర్తు చేసుకున్నారు. బీఆర్‌ఎస్ శాసనసభ్యులు, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, లాస్య నందిత సాయన్న తదితర ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివేక్ తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామ్యేల్ తదితరులు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.