అపాయంలో ఉపాయం

Trick in Jeopardyఒక అడవిలో అనేక రకాల జంతువులు నివసిస్తున్నాయి. ఆ జంతువులకి రారాజు మృగరాజు. మృగరాజు అయిన సింహం గంభీరంగా ఉండి, అడవిలో ఉన్న జంతువుల పైన అభిమానంతో స్వార్థం లేకుండా పాలన చేస్తుంది. ఇలా ఉండగా పక్క అడవి నుండి ‘కుటిల’ అనే నక్క ఈ అడవికి వచ్చింది. జంతువులన్నింటితో స్నేహం చేసింది. ఆ జంతువులన్నీ నక్కని మృగరాజుకి పరిచయం చేశాయి. ఈ జంతువులన్నీ ఒట్టి అమాయకపు జీవులు. అందుకే ఈ అడవికి ఎప్పుడు రారాజు సింహం అవుతుంది అని అనుకుని, ఈ సింహం ఆటలు ఇంక సాగనివ్వరాదు అనుకుంది టక్కరి నక్క. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది నక్క ప్రతిరోజు సింహం వేటాడడానికి అడవిలో ఏ మూల జంతువులు ఉన్నాయో చూపిస్తూ మృగరాజుకి దగ్గర అయింది నక్క. ఒకరోజు నక్క తన కుటిల బుద్ధితో రా రాజా! ఈ అడవికి దగ్గరలో ఒక చిన్న గూడెం ఉంది. ఆ గూడెంలో మేకలు అధికంగా ఉన్నాయి. వాటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తానంది నక్క. సింహం సరే అంది. రెండూ కలిసి గూడెం వెళ్లి మేకల మందపై దాడి చేశాయి. మేకలన్నీ తప్పించుకున్నాయి ఆ మందలో ఒక అవిటి మేక సింహానికి దొరికిపోయింది. సరే దీనిని ప్రాణంతో అడవికి తీసుకువెళ్లి అక్కడే తిందాం అనింది సింహం. అలాగే మృగరాజ అంది నక్క.
ఈ మూడు జంతువులు గూడెం నుండి అడవికి వెళ్తున్నాయి. మార్గం మధ్యలో ఒక బావిని చూసింది సింహం. వేటాడి అలసిపోవడం వలన బావిలో నీరు తాగుదాం అంది సింహం. నక్క సరే అంది. ఈ మూడూ బావి దగ్గరికి వెళ్లాయి.
ఇదే మంచి సమయం సింహం ఎలాగూ అలసి ఉంది, దీనిని బావిలోకి తోసేస్తా అని నక్క బావిలోకి చూస్తూ రా రాజా! నీళ్లు మీదకే ఉన్నాయి తాగండి అని అంది. సరే అని సింహం నీటిని చూస్తుండగా, అదే సమయంలో హఠాత్తుగా అవిటి మేక పరుగు పరుగున వచ్చి నక్కని తలతో బావిలోకి తోసింది. నక్క బావిలో మునిగిపోయింది.
రాజా! నక్క కపట బుద్ధి తెలియక దానిని నమ్మారు మీరు. అది మీ ప్రాణానికే అపాయం తలపెట్టింది. మృగ రాజా! నన్ను అవిటి దాన్ని చేసింది ఆ నక్కే అని చెప్పింది మేక.
అవునా? అంది సింహం.
అవును రాజా! ఆ నక్క వారం క్రితమే నన్ను వేటాడి పట్టుకుంది. దానికి మస్కా కొట్టి నన్ను నేను రక్షించుకున్న. తెలివిగా నక్క బారి నుండి తప్పించుకున్నాను. అందుకే నక్క కపట బుద్ధి నాకు బాగా తెలుసు అంది మేక.
మృగ రాజా! మిమ్మల్ని బావిలోకి తోసి అడవికి రాజు అవ్వాలనుకుంది నక్క. అలాంటి కపట బుద్ధి కలవారు రాజు అయితే అడవిని, జంతువులని సర్వనాశనం చేస్తారు. అందుకే నేను నక్కని బావిలో తోసేసా. రారాజు అంటే మీరు మృగరాజ! ఒక ఏనుగుని వేటాడి దాని కుంభస్థలంలో ఉన్న కొంచెం రక్తాన్ని తాగి, తక్కిన మాంసాన్ని అడవిలో జంతువులకు ఆహారంగా పడేస్తుంటారు మీరు. మృగరాజ! ఎప్పటికీ మీలాంటి మంచివారే రాజుగా ఉండాలి. మీ పాలనలో జంతువులన్నీ సుఖంగా ఉన్నాయి. కుటిల బుద్ధి కల నక్క మధ్యలో వచ్చి మధ్యలో పోయింది. అని పలికింది మేక.
మేక మిత్రమా! నువ్వు నాకంటే చిన్న ప్రాణివైనా అపాయంలో ఉపాయాన్ని ఆలోచించి నక్క మోసం నుండి నన్ను కాపాడావు. ఇకనుండి మీ గూడెంలో ఉన్న మేకలకు మా జంతువుల వలన అపాయం జరగనివ్వను అని హామీ ఇస్తున్నాను. ఇక నువ్వు క్షేమంగా మీ గూడేనికి తిరిగి వెళ్ళిపో అని రారాజు పలికింది.
ఇక సెలవు రారాజా! అంటూ మేక తన గూడేనికి ఆనందంగా వెళ్లిపోయింది.
– బల్ల కష్ణ వేణి, పలాస