త్రిపుర తేయాకు తోటల కార్మిక నేత పను మజుందార్‌ కన్నుమూత

న్యూఢిల్లీ : త్రిపుర ప్రజల కోసం, కార్మిక వర్గ ఉద్యమాల కోసం తన జీవితాంతం విశేషంగా కృషి చేసిన తేయాకు తోటల కార్మిక నేత పను మజుందార్‌ సోమవారం అర్ధరాత్రి సమయంలో త్రిపురలోని జిబిపి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. పను మజుందార్‌గా అందరికీ చిరపరిచితులైన ఆయన పేరు సుధామోయి మజుందార్‌. 1970ల నుంచి ఆయన తేయాకు తోటల కార్మికుల సంక్షేమం కోసం పాటు పడ్డారు. వారందరినీ సంఘటితం చేసేందుకు ఎంతగానో కృషి చేశారు. త్రిపుర రాష్ట్ర సిఐటియు ఏర్పాటు కాలం నుండి ఆయన కీలక నిర్వాహకుడి పాత్ర పోషించారు. కార్మిక వర్గ విముక్తి ప్రయోజనాల కోసమే ఆయన తన జీవితాన్ని ధారబోశారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. మొత్తంగా తన జీవితాన్ని తేయాకు తోటల కార్మికులకే అంకితం చేశారు.
సీఐటీయూ సంతాపం
ఆయన మృతికి సీఐటీయూ ఘనంగా నివాళులర్పించింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటన జారీ చేస్తూ, తను ఎంతగానో ప్రేమించి, అభిమానించే కార్మిక సోదరులను విడిచి మజుందార్‌ వెళ్లిపోయారని పేర్కొన్నారు.