నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్గించడం సరికాదనీ, అలా వ్యవహరించేవారిపట్ల చట్టపరమైన చర్యలు తప్పవని టీఎస్‌ఈఆర్సీ చైర్మెన్ తన్నీరు శ్రీరంగారావు అన్నారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురా డివిజన్‌లో కరెంటు బిల్లు కట్టలేదని సర్వీస్ కట్ చేసిన విద్యుత్ సిబ్బందిపై సదరు వినియోగదారుడు కత్తితో దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్‌కేసు కూడా నమోదయ్యింది. ఈ ఘటనలో ధైర్యంగా విధులు నిర్వహించిన ఆర్టిజన్ మమ్మద్ అబ్దుల్ సలీం రుహీ, ఏఈ (ఆపరేషన్స్) జీ లక్షీనారాయణ రాజును సోమవారంనాడిక్కడి టీఎస్‌ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో సత్కరించారు. చైర్మెన్ శ్రీరంగారావుతో పాటు సభ్యులు ఎమ్‌డీ మనోహరరాజు, బండారు కృష్ణయ్య, కార్యదర్శి నారం నాగరాజు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ స్వామి రెడ్డి సదరు ఉద్యోగులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ప్రజలు సహకరించాలే తప్ప, అవరోథాలు కల్పించకూడదని చెప్పారు. నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహించిన విద్యుత్ ఉద్యోగులు మరికొందరికి స్ఫూర్తిని ఇస్తారని అన్నారు.
విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి, విద్యుత్ సంస్థలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని చెప్పారు.