ముగిసిన టీఎస్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు

–  బరిలో 103 మంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ)లో 13 మంది సభ్యుల ఎన్నికకు గానూ 103 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు నామినేషన్‌ పత్రాలను పంపిణీ చేశారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈ నెల 8న నామినేషన్లను పరిశీలించారు. కాగా ఈ నామినేషన్లలో 103 నామినేషన్లు అర్హమైనవిగా నిలిచాయని టీఎస్‌ ఎంసీ ఎలక్షన్స్‌ -2023 రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వి.శ్రీహరిరావు తెలిపారు. నామినేషన్లను ఉపసంహరించుకునే గడువు ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. 12న సాయంత్రం 5 గంటలకు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారు వెల్లడించనున్నారు. బ్యాలెట్‌ పేపర్లను ఈ నెల 30 నుంచి నవంబర్‌ 15 వరకు పంపిణీ చేయ నున్నారు. కాగా వాటిని నవంబర్‌ 30 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. డిసెంబర్‌ ఒకటిన ఓట్ల లెక్కింపును మొదలు పెడతారు. ఈ ఎన్నికల్లో అర్హత కలిగిన ఓటర్లు 48,405 మంది ఉన్నారు.