టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి

TSPSC board should be abolished– చైర్మెన్‌పై కేసులు పెట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు
– సడక్‌బంద్‌లో నాయకుల అరెస్ట్‌
నవతెలంగాణ-హయత్‌నగర్‌
టీఎస్‌పీఎస్సీని రద్దు చేసి, చైర్మెన్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి.నర్సింహారావు అన్నారు. శనివారం సడక్‌ బంద్‌ కార్యక్రమంలో భాగంగా సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్‌ హెచ్‌.డి. ఏఫ్‌.సి బ్యాంకు ఎదురుగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా డిజి నర్సింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జాబ్‌ క్యాలెండర్‌ లేకపోవడం.. ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద రూ.మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు సక్రమంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక కుటుంబానికి రూ.50 లక్షల ఏక్సగ్రేషియా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బోర్డును పునరుద్ధరించి వెంటనే పరీక్షలు నిర్వహించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో నాయకులను పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు ముత్యాల యాదిరెడ్డి, కెవి.రంగారెడ్డి, సామిడి శేఖర్‌ రెడ్డి, ఆందోజు రవీంద్ర చారి, అజ్మీర్‌ హరిసింగ్‌ నాయక్‌, దిగోజు వేణుగోపాల్‌, కేతరాజు నర్సింహా, పెద్ద అంబర్‌ పేట్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్‌ పబ్బతి లక్ష్మణ్‌, జనసమితి పల్లె వినరు కుమార్‌ పాల్గొన్నారు.