నిండుకుండల్లా జంట జలాశయాలు

– పూర్తిస్థాయికి చేరిన హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం
– 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ-గండిపేట్‌
రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌ చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో శనివారం అధికారులు ఆరు గేట్లను ఎత్తారు. నాలుగు రోజుల నుంచి ఎగువ ప్రాంతాలైన తాండూర్‌, పరిగి, వికారాబాద్‌, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, శంషాబాద్‌ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్‌ నుంచి 1375 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం 1763 అడుగులు. గండిపేట్‌ 1790 అడుగుల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 1786కు చేరింది. గండిపేట పూర్తిస్థాయిలో చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. రాజేంద్రనగర్‌ వైపు వెళ్లే ఔటర్‌ సర్వీసింగ్‌ రోడ్డును పూర్తిగా మూసేశారు.