కేరళలో నిపా వైరస్‌తో ఇద్దరు మృతి

– మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు
– నియంత్రణ చర్యలు పెంపు
తిరువనంతపురం : కేరళలో నిపా వైరస్‌ భయపెట్టిస్తున్నది. కోజికోడ్‌ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిపా వైరస్‌తో మరణించగా, మరో ముగ్గురికి పాజిటివ్‌గాతేలింది. పాజిటివ్‌గా తేలిన ఆ ముగ్గురు చికిత్స పొందుతున్నారు. నేషనల్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐవీ) పూణె నివేదికల ప్రకారం కోజికోడ్‌లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో నిపా లక్షణాలను కలిగి ఉన్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలలో ఒకరు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య ఐదుకి చేరుకున్నది. రోగులలో కనిపించే వైరస్‌ జాతిని బంగ్లాదేశ్‌ జాతిగా గుర్తించారు. 157 మంది ఆరోగ్య కార్యకర్తలు సహా 789 మంది వ్యాధి సోకిన వ్యక్తులతో కాంటాక్టులో ఉన్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది. తొమ్మిది గ్రామ పంచాయతీల్లోని 58 వార్డులను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఈనెల 14, 15 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవులు ప్రకటించింది. ఈనెల 24 వరకు భారీ బహిరంగ సభలు నిర్వహించడం మానుకోవాలని ఆరోగ్య, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి వీణా జార్జ్‌ కోజికోడ్‌కు ప్రజలను కోరారు. జిల్లాలో రద్దీ నియంత్రణ నిబంధనలను ప్రకటించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) డోసేజ్‌లను ఎయిర్‌లిఫ్ట్‌ చేసింది. దీంతో వైరస్‌ యాంటీబాడీలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.